గవర్నర్‌‌కు మళ్లీ అవమానం

గవర్నర్‌‌కు మళ్లీ అవమానం
  • భద్రాచలం వెళ్లిన తమిళిసైకి స్వాగతం పలకని జిల్లా కలెక్టర్, ఎస్పీ
  • పట్టాభిషేకం వేడుకలోనూ కనిపించని ఆఫీసర్లు
  • 48 గంటల సెలవులో  కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో!
  • కల్యాణం కాగానే హైదరాబాద్‌‌‌‌ వచ్చేసిన మంత్రులు
  • మొన్న మేడారం,  నిన్న యాదాద్రి.. 

భద్రాద్రి కొత్తగూడెం / భద్రాచలం, వెలుగు: గవర్నర్ తమిళిసైని రాష్ట్ర సర్కారు మరోసారి అవమానించింది. భద్రాచలంలో సీతారాముల పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌‌‌‌‌‌‌‌కు స్వాగతం పలికేందుకు కలెక్టర్, ఎస్పీ రాలేదు. ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అనుదీప్‌‌‌‌, ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏ పీవో గౌతం పోట్రు.. సోమవారం ఎక్కడా కనిపించలేదు. గవర్నర్​ పర్యటన నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆఫీసర్లను ప్రభుత్వం 48 గంటల సెలవుపై పంపించినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాములోరి కల్యాణ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్‍కుమార్, సత్యవతి రాథోడ్‍, ఇంద్రకరణ్‍రెడ్డి, ఇతర అధికారులు ఆదివారం సాయంత్రమే హైదరాబాద్​వెళ్లిపోయారు. కానీ రవీంద్రభారతిలో కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించకుండా ముగించేశారు.

ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని, తాను పర్యటనలకు వెళ్లినప్పుడు ఆహ్వానించేందుకు కనీసం ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లు రాకుండా అడ్డుకుంటోందని గవర్నర్​ఇటీవలే ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొదట మేడారం, తర్వాత యాదాద్రి, ఇప్పుడు భద్రాద్రిలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ను అవమానించేలా ఆఫీసర్లు ప్రొటోకాల్​ పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ట్రైన్‌‌‌‌లో కొత్తగూడేనికి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొత్తగూడేనికి గవర్నర్ తమిళిసై వచ్చారు. సికింద్రాబాద్ – మణుగూరు ట్రైన్‌‌‌‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోగీలో కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్‌‌‌‌కు చేరుకున్నారు. ఆమెకు కలెక్టర్ అనుదీప్‌‌‌‌తోపాటు ఎస్పీ సునీల్​దత్ స్వాగతం పలకాల్సి ఉంది. కానీ వీరిద్దరూ రాలేదు. వారి స్థానంలో అడిషనల్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ స్వర్ణలత, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ స్వాగతం పలికారు. ప్రత్యేక కాన్వాయ్‌‌‌‌లో ఇల్లెందు క్రాస్​రోడ్డులోని సింగరేణి గెస్ట్​హౌస్‌‌‌‌కు గవర్నర్ చేరుకున్నారు. అక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ ఎన్.బలరాం, జీఎం కె.బసవయ్య ఆహ్వానించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత ఉదయం 9 గంటలకు భద్రాచలానికి తమిళిసై బయల్దేరారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. వారికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్వాగతం పలికారు. ఈవో శివాజీ నేతృత్వంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఐఏఎస్ గౌతమ్ పోట్రు రాలేదు.

సమయానికి గాయబ్

శ్రీరామనవమి ఏర్పాట్లపై శనివారం నిర్వహించిన సమీక్షలోనూ ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకల్లోనూ కలెక్టర్, ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏ పీవో గౌతం పోట్రు పాల్గొన్నారు. సోమవారం జరిగిన శ్రీరామపట్టాభిషేకంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. గవర్నర్ ​పర్యటన ఉందన్న కారణంతో వీరిని ప్రభుత్వం 48 గంటల సెలవుపై పంపించినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముగ్గురు మంత్రులు, ఎండోమెంట్ కమిషనర్ అనిల్​కుమార్, పంచాయతీరాజ్‍ కమిషనర్‍ శరత్ కూడా పట్టాభిషేకం కోసం ఉండకుండా ఆదివారం సాయంత్రమే హైదరాబాద్​వెళ్లిపోయారు. దీంతో అడిషనల్​కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు మాత్రమే గవర్నర్ ​వెంట ఉండగా, భద్రాచలం, మణుగూరు ఏఎస్పీలు రోహిత్‍రాజు, శబరీష్‍, ట్రైనీ ఏఎస్పీ క్రాంతి బందోబస్తు పర్యవేక్షించారు. మంగళవారం దమ్మపేట మండలం పూసుకుంటలోని కొండరెడ్ల గ్రామంలో గవర్నర్ పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలోనూ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పాల్గొనే అవకాశం లేదని తెలిసింది.

ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి: తమిళిసై

మన రాష్ట్రంతోపాటు దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని రామయ్యను సిస్టర్‍ ఆఫ్ తెలంగాణగా తాను ప్రార్థించినట్లు గవర్నర్ తమిళిసై చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ కావడం వల్ల సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. పట్టాభిషేకం తర్వాత మిథిలాస్టేడియం బయట ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై మీడియా ప్రశ్నించగా.. తాను పట్టాభిషేకం చూడడానికే వచ్చానని, ఇతర విషయాల జోలికి వెళ్లదలుచుకోలేదని చెప్పారు. తర్వాత కూనవరం రోడ్డులోని వీరభద్ర ఫంక్షన్ హాలులో వనవాసీ కల్యాణ పరిషత్‍ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు నిర్వహించిన సామూహిక సీమంతాల వేడుకల్లో తమిళిసై పాల్గొన్నారు. గర్భిణులకు పూలు, పండ్లు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చీర, సారె అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు 
చేయించుకోవాలని సూచించారు.