
సూర్యాపేట, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో 2025 - – 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, పత్తి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పత్తి రాకను బట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షెడ్యూల్ తయారు చేయాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి మార్కెటింగ్ అధికారులు సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ రూపొందించాలన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 10, 30, 868 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందని, కొనుగోలు కేంద్రాల ద్వారా 4,30,880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
సన్నధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఏ గ్రామంలో ఏ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారో స్పష్టంగా ముందే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు మాట్లాడుతూ మిల్లర్లు 2025- – 26 ధాన్యం కొనుగోలు సందర్భంగా బ్యాంకు గ్యారంటీలను తప్పనిసరిగా ముందే ఇవ్వాలని అన్నారు. సమావేశంలో డీఎస్వో మోహన్ బాబు, డీఎం సివిల్ సప్లయ్ రాము, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఆర్డీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.