నూతన ఆవిష్కరణకు జిల్లా వేదిక కావాలి : తేజస్ నందలాల్ పవార్

నూతన ఆవిష్కరణకు జిల్లా వేదిక కావాలి : తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: నూతన ఆవిష్కరణలకు సూర్యాపేట జిల్లా వేదిక కావాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్ ను అడిషనల్​ కలెక్టర్ బీఎస్ లతతో కలిసి పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులు, యువకులు నూతన ఆవిష్కరణపై మూడు నిమిషాల వ్యవధిలో వీడియో తీసి  9100678543 నంబర్​కు వాట్సాప్ చేయాలని సూచించారు.

పాఠశాలలతోపాటు గ్రామాల్లో ఇన్నోవేషన్ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థులు తీసిన వీడియోలను అధికారులు ఎంపిక చేసి స్వాతంత్ర దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్​లో ఇన్నోవేషన్ ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీఎంహెచ్ వో  కోటాచలం, డీపీవో సురేశ్ కుమార్, డీటీడీవో  శంకర్, డీడబ్ల్యూ వెంకటరమణ, డీఈవో అశోక్,  ఎల్.దేవరాజు , జిల్లా కో–ఆర్డినేటర్ రాజు, అధికారులు పాల్గొన్నారు. 

లక్ష్యాలను అధిగమించాలి

వనమహోత్సవానికి శాఖలవారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 7,98,100 మొక్కలు నాటామని చెప్పారు.

 ప్రజా పాలన దరఖాస్తుల కోసం అన్ని మండలాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో  రెవెన్యూ శాఖకు  సంబంధించి 59 దరఖాస్తులు, డీఆర్డీవో 8, మెడికల్ 6 మొత్తం దరఖాస్తులు 98 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు.