ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలె : రాజర్షి షా

ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలె : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు:   మెదక్​, నర్సాపూర్​ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను గడువులోగా సమర్పించాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. శుక్రవారం మెదక్​కలెక్టర్​ఆఫీసులో అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు రికన్సీలేషన్ నిర్వహించారు. ఎన్నికల వ్యయపరిశీలకుడు సంజయ్ కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను, వ్యత్యాసాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించి రోజువారీ ఖాతా రిజిస్టర్, నగదు లావాదేవీల రిజిస్టర్, బ్యాంక్ రిజిస్టర్, స్టేట్‌మెంట్ షెడ్యూల్​లో 1 నుంచి 11 వరకు  గల ఎన్నికల ఖర్చుల వివరాలను సరి చూసుకొని అన్ని బిల్లులను గడువులోగా అందించాలన్నారు. బ్యానర్స్, పోస్టర్స్, దినపత్రికలు, టీవీ ఛానల్స్​లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైన ఖర్చుల తెలియజేయాలని సూచించారు.

ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను సమర్పించని వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈసీ అనర్హులుగా ప్రకటిస్తే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోతారని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు,  జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి  రాకేశ్ , ఈడీఎమ్​ సందీప్, ఏజెంట్లు పాల్గొన్నారు.