స్కూల్‌కు లేటొస్తే ఊరుకునేది లేదు - కలెక్టర్‌ ఉదయ్ కుమార్

స్కూల్‌కు లేటొస్తే ఊరుకునేది లేదు - కలెక్టర్‌ ఉదయ్ కుమార్

కల్వకుర్తి : టీచర్లు స్కూల్‌కు లేట్‌గా వస్తే ఊరుకునేది లేదని కలెక్టర్‌ ఉదయ్ కుమార్ హెచ్చరించారు.  శుక్రవారం కల్వకుర్తి మండలం తోటపల్లి హై స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  10 .10 గంటలకే స్కూల్‌కు వచ్చినా కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండడంతో హెచ్‌ఎం విజయ భాస్కర్‌‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది టీచర్లు లీవ్‌లో ఉండడం పైనా మండిపడ్డారు. వెంటనే డీఈవోతో  ఫోన్‌లో మాట్లాడుతూ హైస్కూళ్ల పర్యవేక్షణ ఎవరు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.  

ప్యానల్ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించి రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించారు.   అనంతరం 7వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు.  చాలా మంది కూడికలు, తీసివేతలు, గుణకారాలు,  భాగహారాలు చేయలేకపోయారు. తెలుగు కూడా చదవలేకపోయారు.. దీంతో హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసి.. బేస్ లైన్ పరీక్ష నిర్వహించి విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బెక్కెర ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థి తెలుగు, గణితం, ఇంగ్లీష్‌లో చకచకా రాయడం, చదవడం చేయడంతో హెచ్‌ఎంను రఘు రామారావును అభినందించారు.  కలెక్టర్ వెంట సెక్టోరల్ అధికారి సతీశ్ కుమార్, కల్వకుర్తి తహసీల్దార్‌‌ రామ్ రెడ్డి, ఎంఈవో భాసు నాయక్  ఉన్నారు.