విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: విత్తనాలు, ఎరువులను ఎక్కువ ధరలకు అమ్మితే జిల్లాలోని ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని హిమాన్షు ట్రేడర్ ఫర్టిలైజర్, సత్యసాయి ఫర్టిలైజర్స్ షాపును తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్, రసీదు పుస్తకాలు, ధరల పట్టిక, తూకం యంత్రం, విత్తన ప్యాకెట్లను పరిశీలించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని, సంబంధిత కంపెనీ పేరుతో రసీదు తప్పనిసరిగా రైతులకు అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ రేట్లకు అమ్మితే షాపు లైసెన్స్ రద్దుచేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

తాండూరు, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తాండూరు సీఐ కుమారస్వామి హెచ్చరించారు. నకిలీ పత్తి విత్తనాలపై శుక్రవారం తాండూరులోని ఐబీలో పోలీసులు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నకిలీ పత్తి విత్తనాల వల్ల భూమి సారం కోల్పోతుందని, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోదని పేర్కొన్నారు. 

నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని సాగుచేయొద్దని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలన్నారు. అంతకు ముందు ఎంపీడీవో కార్యాయం నుంచి ఐబీ వరకు భారీ రాలీ నిర్వహించారు. అనంతరం అధికారులు, రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్, తాండూరు ఎస్సై కిరన్​
కుమార్, వ్యవసాయాధికారి సుష్మ పాల్గొన్నారు.