
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. రెబ్బెన మండలం వంకులంలోని ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించి క్లాస్‌రూమ్‌లు, కిచెన్, అందిస్తున్న ఆహారం, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. ఆహారంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసరాలు వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కైర్గావ్లోని పల్లె దవాఖానాను తనిఖీ చేసి మందుల గది, వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, అంటువ్యా ధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా నెలలు నిండిన గర్భిణులను సుఖ ప్రసవం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు.