
ఆసిఫాబాద్, వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే చెప్పారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మెడికల్ స్టూడెంట్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన క్వాలిటీ పరిశీలించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతీ పాఠశాలలో తనిఖీలు చేపట్టాలని, సమస్యలుంటే పరిష్కరించాలని ఆదేశించారు.
జీపీవో, సర్వేయర్పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 27న జీపీవో, లైసెన్స్డ్ సర్వేయర్అర్హత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పరీక్షలు జరుగుతాయన్నారు.
జీపీవో అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సర్వేయర్అభ్యర్థులకు 2 సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, ఫర్నిచర్ ఉండేలా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని పేర్కొన్నారు.