వరి విత్తనాలు అమ్మితే షాపు ​క్లోజ్ చేస్తం

వరి విత్తనాలు అమ్మితే షాపు ​క్లోజ్ చేస్తం
  • సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ చేయనియ్య
  • ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులను కూడా పట్టించుకోను
  • సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి

సిద్దిపేట, వెలుగు: రైతులకు విత్తన డీలర్లు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఆ షాపులను క్లోజ్ చేస్తామని, తాను జిల్లా కలెక్టర్ గా ఉన్నంతకాలం ఓపెన్ ​చేయనివ్వబోనని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చినా పట్టించుకోనని కామెంట్​చేశారు. సోమవారం కలెక్టరేట్​లో వరి విత్తన డీలర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ‘జిల్లాలో 350 విత్తన షాపులున్నయి. ఆన్ రికార్డుగా చెబుతున్న. ఏ షాపులోనైనా కిలో వరి విత్తనాలు అమ్మినట్టు తెలిసినా ఆ పరిధిలోని ఏఈవోలు, ఏవోను సస్పెండ్ చేస్త. విత్తనాలు అమ్మిన షాపులను క్లోజ్ చేయిస్త. మీ ఎమ్మెల్యేతోనో, ఎంపీ తోనో, వేరే సీనియర్ ఆఫీసర్లతోనో ఫోన్ చేయించినా పట్టించుకోను. ఫోన్ చేయిస్తే.. మరో మూడు నెలలు క్లోజ్ చేయిస్తా’ అని హెచ్చరించారు. వచ్చే యాసంగిలో వరి సాగు తగ్గించాలన్న సర్కారు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో విత్తన డీలర్లు, అగ్రికల్చర్​ ఆఫీసర్లతో కలెక్టర్లు ​సమావేశమయ్యారు. అన్నిచోట్లా వరి సాగు తగ్గించాలని, వరి సీడ్ తక్కువ అమ్మాలని కలెక్టర్లు చెబితే సిద్దిపేట కలెక్టర్ మాత్రం ఒకింత సహనం కోల్పోయి మాట్లాడటం చర్చనీయాంశమైంది.

కాగా.. కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వరి పండించే అవకాశం లేనప్పుడు లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టుల కట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు.

 

కేసీఆర్ వ్యవసాయంపై రైతులతో చర్చించకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి అన్నారు. బెదిరింపులతో రైతులను, వ్యవసాయాన్ని అడ్డుకోలేరని ఆయన స్పష్టంచేశారు.