
- కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంచుతారా..
- మెను ప్రకారం భోజనం పెడుతున్నారా..
- టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
సిరికొండ, వెలుగు : పాఠశాలంతా చెత్తచెదారంతో ఉంటుందా.. మీరంతా రోజు ఏం చేస్తున్నారూ.. పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలిగా.. కిచెన్, టాయిలెట్స్ ఇంత అపరిశుభ్రంగా ఉంటాయా.. మళ్లీ వస్తా.. ఇలాగే ఉంటే చర్యలు తప్పవు అంటూ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని చిమన్పల్లి గ్రామ మహాత్మాజ్యోతిబాపులే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రికార్డులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
కిచెన్‌రూం, టాయిలెట్స్‌ను చూసి అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అంటూ ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు తెలిపితే పరిష్కరిస్తారని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్, ఏఈ హర్షద్ తదితరులు ఉన్నారు.
ఏటీసీ కేంద్రాల్లో ప్రవేశాలకు కృషి చేయండి
బాల్కొండ : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం కమ్మర్ పల్లి, భీంగల్, సిరికొండ మండలాల్లో ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు, ఏటీసీ సెంటర్లను తనిఖీ చేశారు. బషీరాబాద్, భీంగల్ ఏటీసీ సెంటర్లలో సదుపాయాలు పరిశీలించారు. భీంగల్ సెంటర్ తుది దశ పనులను పూర్తి చేయాలని, ఆయా కోర్సుల్లో పూర్తిస్థాయిలో అభ్యర్థులు ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులనుఆదేశించారు.