సిద్దాపూర్ రిజర్వాయర్ సరిహద్దులను నిర్ధారించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

సిద్దాపూర్ రిజర్వాయర్ సరిహద్దులను నిర్ధారించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

వర్ని, వెలుగు :   సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ బండ్ నిర్మాణానికి సరిహద్దులను నిర్ధారించాలని  కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి అన్నారు.  శుక్రవారం రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో కలిసి వెళ్లి రిజర్వాయర్​ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. రిజర్వాయర్​ పూర్తైతే నిజాంసాగర్​ పరిధిలోని భూములకు సాగు నీరు అందుతుందన్నారు. 

 వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో కాలి నడకన వాగులు, కొండలను దాటుతూ, రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతానికి కలెక్టర్​చేరుకున్నారు.  స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై  బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్, ఇతర అధికారులతో చర్చించారు. అటవీ భూమి అవసరమైతే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు.   

నగర పాలక భూముల రక్షణకు చర్యలు

నిజామాబాద్ :  నిజామాబాద్​నగరపాలక సంస్థ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్​ ఆఫీసర్, కలెక్టర్  వినయ్​కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం నగర పాలక అంశాలపై నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో మాట్లాడారు. టాక్స్ కలెక్షన్ వంద శాతం జరగాలని, నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించమన్నారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయాలన్నారు. 

 గ్రాస్ కట్టింగ్, డ్రిల్ మెషిన్​లు కొనడానికి  ఆమోదం తెలిపారు. వాహనాలకు రిపేర్ల అవసరం ఉంటే చేయించాలన్నారు. వనమహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. టౌన్ ఏరియాలో 400 చదరపు అడుగులలోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జీ+1 పద్ధతిలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.  అడిషనల్​కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్, హౌసింగ్ పీడీ పవన్​కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు పాల్గొన్నారు.