
నిజామాబాద్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. కరెంట్ కనెక్షన్, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు. అదనంగా ఇందిరమ్మ ఇండ్లు, అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
ఎలక్షన్ కోడ్ కారణంగా పనులు ఆగకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు.
భోజనాలు వడ్డించిన కలెక్టర్..
పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని గణేశ్మండలిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కలెక్టర్, సీపీ సాయి చైతన్య పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడికి పూజలు చేశారు.
గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
నందిపేట/నవీపేట, వెలుగు : ఈనెల 6న జరగనున్న గణేశ్నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద పరిశీలించారు. క్రమపద్ధతిగా వాహనాలు నిలిపి, భారీ విగ్రహాలను సురక్షితంగా క్రేన్ల సాయంతోనిమజ్జనం చేసుకోవాలన్నారు. నిజామాబాద్, మెదక్, నల్గొండ, కామారెడ్డి, హైదరాబాద్ ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, రైల్వే గేట్ల వద్ద కరెంట్ సరఫరా, వన్-వే వాహన మార్గాలు, వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్ అంకిత్ చంద్రశేఖర్, అడిషనల్ సీపీ బస్వారెడ్డి, ఏ సీపీ రాజా వెంకట్ రెడ్డి, డీఎంహెచ్‌వో రాజశ్రీ, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో నాగనాథ్, నార్త్ రూరల్ సీఐబీ శ్రీనివాస్, ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.