
- అధికారులకు కలెక్టర్ల ఆదేశం
ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, ఈ నెల 30లోగా కొనుగోళ్లు కంప్లీట్ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. ఆసిఫాబాద్ మండలం అప్పపెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. కొనుగోళ్లలో సమస్యలుంటే తెలియజేయాలని, పరిష్కారం దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. తూకంలో మోసాలు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.
వర్షాలు కురిసే అవకాశమున్నందున టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు నిత్యం అందుబాటులో ఉంచాలన్నా. కలెక్టర్ వెంట సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నర్సింహరావు, డీఎఫ్ఓ వినోద్ కుమార్, జిల్లా కోఆపరేటివ్ అధికారి రబ్బానీ, సిబ్బంది ఉన్నారు. నిర్ణీత గడువులోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మామడ మండలం పొన్కల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత వివరాలను ట్యాబ్లో కచ్చితంగా ఎంట్రీ చేయాలన్నారు.
ధాన్యం మిల్లులకు తరలించేందుకు వీలుగా సరిపడినన్ని లారీలు, కూలీలను అందుబాటులో ఉంచాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మామడ మండలం అనంతపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించారు. జూన్ 5వ తేదీలోపు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈఓ రవీందర్ రెడ్డి, డీఎం శ్రీకళ, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు తదితరులున్నారు.