నెట్వర్క్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు స్పీడప్చేయాలని, రైతులకు నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. కొనుగోళ్లను స్పీడప్చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల, నమ్నూర్, రాపల్లిలోని సెంటర్లను కలెక్టర్కుమార్దీపక్సందర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రామారెడ్డి మండలం గిద్దలో వడ్ల కొనుగోళ్లు, సదాశివనగర్ మండలం ఉత్తునూర్‌లో మక్కల కొనుగోలు సెంటర్లను కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా ఉండేందుకు ఆఫీసర్లు కో అర్డినేషన్తో పనిచేయాలన్నారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట, నాగారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ గరిమా అగ్రవాల్ తనిఖీ చేశారు.
వేములవాడ రూరల్ మండలం, మల్యాల, రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొనుగోలు సెంటర్లు, రైస్ మిల్లులను అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. ఆదిలాబాద్ లోని మార్కెట్ యార్డులో జొన్నలు, మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియను, గోదాముల్లో నిల్వలను కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జొన్న రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైస్ మిల్లుల్లో త్వరితగతిన వడ్లు దింపుకోవాలని, అన్ లోడింగ్‌కు కొర్రీలు పెట్టొద్దని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా మిల్లర్లకు సూచించారు.
తిమ్మాపూర్ మండలం రేణిగుంట పరిధిలోని శ్రీ సాయి శ్రీనివాస, ఆర్కే రైస్ మిల్లులను బుధవారం ఆమె తనిఖీ చేశారు. మిల్లర్లు, రవాణాదారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది సమన్వయంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సైదాపూర్ మండలం వెంకెపల్లిలోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, దుద్దెనపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. నిజామాబాద్మండలం ఖానాపూర్గ్రామంలోని లక్ష్మీబాలాజీ, శ్రీసిద్దిరామేశ్వర రైస్‌మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్ల నుంచి తరుగు తీస్తున్నారా? తదితర అంశాలపై ఆరా తీశారు. కస్టమ్మిల్లింగ్రైస్ను పరిశీలించారు. పలు చోట్ల అడిషనల్, సబ్కలెక్టర్లు తనిఖీలు చేపట్టారు.
