ఓటరు జాబితాలో తప్పులను సవరిస్తాం : కలెక్టర్ అభిలాష అభినవ్

ఓటరు జాబితాలో తప్పులను సవరిస్తాం : కలెక్టర్ అభిలాష అభినవ్
  • ఈ నెల 9 లోగా అభ్యంతరాలు అందించాలి
  • కలెక్టరేట్లలో అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ల సమావేశం

నిర్మల్/నస్పూర్/ఆసిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. నిర్మల్ కలెక్టరేట్​లో కలెక్టర్ అభిలాష అభినవ్, మంచిర్యాల కలెక్టరేట్​లో కలెక్టర్ కుమార్​దీపక్, ఆసిఫాబాద్​లో కలెక్టర్ ​వెంకటే శ్​ధోత్రే, ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో కలెక్టర్​ రాజర్షి షా మంగళవారం మున్సిపాలిటీలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. 

ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై చర్చించారు. ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియపై వివరించారు. డి లిమిటేషన్ ప్రక్రియలో నిర్ధారణ చేసిన హద్దుల ప్రకారమే ముసాయిదా ఓటరు జాబితా రూపొందించామని, మార్పులు ఏమైనా ఉన్నట్లయితే సరిచేస్తామని తెలిపారు. 

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లు, చిరునామాలు తదితర వివరాల్లో తప్పులుంటే ఈ నెల 9వ తేదీ వరకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు లేదా జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందజేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

10న తుది ఓటరు జాబితా

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని కలెక్టర్లు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు ఓటరు జాబితాపై సహకరించాలని, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రాంతాలపై అభ్యంతరాలుంటే వెంటనే సమర్పించాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

టి పోల్ యాప్​లో వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించుకోవచ్చని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఉండేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు సహకరించాలని తెలిపారు. సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్లు, సబ్​కలెక్టర్లు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.