స్టూడెంట్ల వద్ద డ్రగ్స్ దొరికితే.. యాజమాన్యంపైనా కేసులు పెడ్తం: డీజీపీ వార్నింగ్

స్టూడెంట్ల వద్ద డ్రగ్స్ దొరికితే.. యాజమాన్యంపైనా కేసులు పెడ్తం: డీజీపీ వార్నింగ్
  • కాలేజీలు, యూనివర్సిటీలకు డీజీపీ సీవీ ఆనంద్‌‌ వార్నింగ్
  • విద్యా సంస్థల్లో కొత్తగా యాంటీ డ్రగ్స్​ కమిటీలు ఏర్పాటు చేస్తం
  • డ్రగ్స్​ కట్టడికి కమిషనర్లు, ఎస్పీలు ఈగల్‌‌ ఫోర్స్‌‌తో కలిసి పని చేయాలి
  • ఏఆర్‌‌‌‌, సివిల్ పోలీసులతో 
  • ఈగల్ ఫోర్స్​ను మరింత 
  • బలోపేతం చేస్తమని వెల్లడి
  • డ్రగ్స్​ కంట్రోల్​పై అధికారులతో సమీక్ష సమావేశం 

హైదరాబాద్‌‌, వెలుగు: కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరికితే ఇకపై స్టూడెంట్లతో పాటు యాజమాన్యాలపైనా కేసులు నమోదు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌‌ హెచ్చరించారు. గురువారం ఆయన బంజారాహిల్స్‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌ కమాండ్‌‌ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో డ్రగ్స్​కంట్రోల్​పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈగల్ పనితీరు, గోవా, ముంబై సహా ఈగల్‌‌ ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌ ఆపరేషన్ల గురించి సందీప్ శాండిల్యా పావర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈగల్‌‌ ఫోర్స్‌‌ సిబ్బంది పెంపు, జిల్లాల్లోని సీపీలు, ఎస్‌‌పీలతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు యాక్షన్​ప్లాన్​ రూపొందించారు.  సమీక్ష అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. 

కాలేజీలు, యూనివర్సిటీల్లో కొత్త కమిటీలు

డ్రగ్స్ కేసుల్లో  రిపీటెడ్‌‌గా పట్టుబడుతున్నవారిపై పీడీ యాక్ట్ తరహాలో ఎన్‌‌డీపీఎస్‌‌ చట్టంలోని పీఐటీ యాక్ట్‌‌ చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన ప్రహరీ క్లబ్‌‌లు, యాంటీ డ్రగ్స్ కమిటీలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని, వీటి స్థానంలో  కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రగ్స్, గంజాయి సహా ఎలాంటి మత్తుపదార్థాల జాడ తెలిసినా కమిటీ సభ్యులు ఈగల్‌‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 డీఅడీక్షన్ సెంటర్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ నిధులతో  మరికొన్నింటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

అలసత్వం పనికిరాదు

రాష్ట్రాన్ని ఎలాగైతే మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామో అదే తరహాలో డ్రగ్స్‌‌ను అరికట్టేందుకు కృషి చేయాలని సిబ్బందికి డీజీపీ పిలుపునిచ్చారు.  జిల్లాల్లో కమిషనర్లు, ఎస్పీలు కూడా డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.  

డ్రగ్స్ కేసుల దర్యాప్తులో కొందరు పోలీస్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇది సరికాదన్నారు. డ్రగ్స్​ కేసుల నమోదు, దర్యాప్తుపై శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ఐదు నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌‌లను బలోపేతం చేస్తామన్నారు. ఈగల్‌‌ ఫోర్స్‌‌లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆపరేషన్స్ నిర్వహించి.. డ్రగ్స్ సరఫరాకు చెందిన ఎన్నో లింకులను ఛేదించిందని ప్రశంసించారు.  కేసులు నమోదు చేయడంతో పాటు డ్రగ్స్ పెడ్లర్లను కట్టడి చేసేందుకు ఏఆర్‌‌‌‌, సివిల్‌‌ పోలీసులను ఈగల్‌‌ ఫోర్స్‌‌లో నియమిస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌‌ పేర్కొన్నారు.