కొత్త దందాకు తెరలేపిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు

కొత్త దందాకు తెరలేపిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు

 

  • జేఈఈ, నీట్, ఎంసెట్ ర్యాంకుల ఆశచూపి దోపిడీ
  • ఇంటర్ బోర్డు పర్మిషన్ లేదు.. ఫీజులపై కంట్రోల్ లేదు
  • స్టూడెంట్లు అకాడమీలో.. అడ్మిషన్లు వేరే కాలేజీల్లో.. 
  • అటువైపు కన్నెత్తి చూడని బోర్డు అధికారులు
  • జిల్లాల్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటలే
  • మూడేండ్ల కాలంలో వీటి సంఖ్య వందల్లోకి

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు కొత్త దందాకు తెరలేపాయి. వివిధ ఎంట్రన్స్‌‌‌‌లకు కోచింగ్ ఇచ్చేందుకు అకాడమీలు ఏర్పాటు చేశామని చెప్పి.. అక్రమంగా కాలేజీలు నిర్వహిస్తున్నాయి. జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్‌‌‌‌ అంటూ పేరెంట్స్‌‌‌‌ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు పెట్టే రూల్స్‌‌‌‌ నుంచి తప్పించుకుంటూ.. ఫీజులు కట్టే అవసరం లేకుండానే యథేచ్ఛగా స్టూడెంట్లపై ‘వ్యాపారం’ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు కన్నెత్తి చూడటం లేదు. ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతున్నా, స్టూడెంట్ల జీవితాలతో విద్యాసంస్థలు ఆడుకుంటున్నా.. అక్రమ అకాడమీలను అడ్డుకోవడం లేదు. జిల్లాల్లో ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోవడం లేదు.  దీంతో కార్పొరేట్ మేనేజ్‌‌‌‌మెంట్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి తయారైంది.కోచింగ్ మాత్రమే ఇస్తున్నట్టు బిల్డప్ ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేలకు పైగా జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలోనైనా ఇంటర్ కోర్సులు చెప్పాలంటే ఇంటర్ బోర్డు పర్మిషన్ తప్పనిసరి. 

కాలేజీ ఏర్పాటు చేస్తే.. ఇంటర్ బోర్డు నుంచి చాలా పర్మిషన్లు తీసుకోవాలి. ఫ్యాకల్టీ, ఫైర్ సేఫ్టీ, సౌలతులవిషయంలో నిబంధనలు పాటించాలి. స్టూడెంట్‌కు ఇంత అని ఫీజు చెల్లించాలి. అదే అకాడమీని ఏర్పాటు చేయాలంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. దీన్ని కొన్ని కార్పొరేట్ మేనేజ్‌మెంట్లు అనుకూలంగా మలుచుకున్నాయి. బోర్డు నిబంధనలు, ఫీజుల నుంచి తప్పించుకునేందుకు అకాడమీల పేరుతో వ్యాపారం మొదలుపెట్టాయి. ఐఐటీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ల కోసం కోచింగ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ.. వాటిలో ఇంటర్ క్లాసులతోపాటు కోచింగ్ ఇస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ప్రధాన సిటీల్లో విచ్చలవిడిగా అకాడమీలు పెడుతున్నా పట్టించుకునేవారు లేరు. మూడేండ్లలో వీటి సంఖ్య వందల్లోకి చేరింది. ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో కాలేజీల కంటే అకాడమీలే బెటర్ అనే నిర్ణయానికి మేనేజ్‌మెంట్లు వచ్చాయి. అకాడమీల్లో హాస్టళ్లకు పర్మిషన్ లేకున్నా.. అవి కొనసాగుతున్నాయి.

చదువు ఇక్కడే.. అడ్మిషన్ ఎక్కడో..

అకాడమీల యాజమాన్యాలు.. విద్యార్థులకు ఇంకో కాలేజీలో అడ్మిషన్లు తీసుకుంటాయి. కానీ పేరెంట్స్‌కు, స్టూడెంట్స్‌కు ఈ విషయం చెప్పవు. దీంతో చదివేది ఒకచోట.. అడ్మిషన్ ఇంకోచోట ఉంటున్నది. హాల్ టికెట్లు అసలు కాలేజీ వివరాలు వారికి తెలుస్తున్నాయి. ఆ టైమ్ లో చేసేదేమీ లేక పేరెంట్స్ కూడా పట్టించుకోవడం లేదు. మరోవైపు అకాడమీలు ఫార్వర్డ్ చేసే కాలేజీల్లో స్టూడెంట్ల రికార్డులుంటాయి.. కానీ స్టూడెంట్లు ఉండరు. అకాడమీల్లో స్టూడెంట్లు చదువుకుంటున్నా.. అధికారిక రికార్డుల్లో మాత్రం స్టూడెంట్ల పేర్లుండవు. ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇలాంటి దందాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది.

లక్షల్లో ఫీజులు

రెంట్స్ ఆశలను పెట్టుబడిగా మార్చుకున్న కార్పొరేట్ మేనేజ్‌మెంట్లు అకాడమీల్లో జేఈఈ, నీట్, ఎంసెట్‌లో స్పెషల్ కోచింగ్ అంటూ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. డే స్కాలర్లకే రూ.రెండు లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాస్టళ్లలో ఉండే వారికి మరో లక్ష నుంచి లక్షన్నర ఫీజు ఎక్కువగా ఉంటుంది. అక్కడ కేవలం కోచింగ్ మాత్రమే ఇస్తున్నట్టు బయటికి చెబుతున్నా.. అకాడమీల్లో ఇంటర్ క్లాసులు కూడా నడిపిస్తున్నాయి. స్టడీ మెటీరియల్, యూనిఫామ్ పేర్లతో మరో రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా అడిషనల్ ఫీజులు వసూలు చేస్తున్నాయి.

పబ్లిక్‌గానే ప్రచారం చేసుకుంటున్నరు

కొన్ని అకాడమీలు కాలేజీల పేరుతో, ఇంకొన్ని అకాడమీలు కోచింగ్ సెంటర్ల పేరుతో బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాయి. ర్యాంకులు, మార్కులంటూ మీడియాలో, బ్యానర్లు, ఫెక్సీల ద్వారా భారీగానే డప్పుకొట్టుకుంటున్నాయి. హైదరాబాద్​లోని మాదాపూర్ ఏరియాలో ఏ బిల్డింగ్‌లకు పర్మిషన్ లేదు. అయినా పదుల సంఖ్యలో అక్కడ అకాడమీలు నడుస్తున్నాయి. స్టేట్‌లో నడుస్తున్న మెజార్టీ అకాడమీలు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండానే కొనసాగుతున్నా, వాటి వైపు ఇతర డిపార్ట్ మెంట్ల అధికారులెవరూ కన్నెత్తి  చూడటం లేదు. 

పేరుకు అదొక అకాడమీ.. వివిధ ఎంట్రన్స్‌‌‌‌లకు కోచింగ్ మాత్రమే ఇస్తామని బయటికి చెప్తరు. ఇంకోపక్క ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటరు.. ఇంటర్ క్లాసులు చెప్తరు.. లక్షలకు లక్షలు ఫీజులను పేరెంట్స్‌‌‌‌ నుంచి వసూలు చేస్తరు. తీరా పరీక్షలు వచ్చాక.. ఇంకో కాలేజీ పేరు మీద హాల్‌‌‌‌టికెట్లు ఇస్తరు. తమది కాలేజీ అని చెప్పి స్టూడెంట్లు, పేరెంట్స్‌‌‌‌ను.. కేవలం అకాడమీ మాత్రమే అని చెప్పి సర్కారును.. బురిడీ కొట్టిస్తున్నాయి చాలా విద్యా సంస్థలు. పైసా ఖర్చు లేకుండా అకాడమీలను ఏర్పాటు చేసుకుని ఇలా అందిన కాడికి దోచుకుంటున్నాయి. 

ఏం చేయలేకపోతున్నం

హైదరాబాద్ నగరంతోపాటు పలు ప్రాంతాల్లో అకాడమీల పేరుతో కాలేజీలు కొనసాగుతున్నాయి. కానీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతున్నం. దీనివల్ల ఇంటర్ బోర్డుకూ ఆదాయం తగ్గుతున్నది. ఆయా అకాడమీలు.. కార్పొరేట్ మేనేజ్‌‌‌‌మెంట్లకు సంబంధించినవి. సర్కారు నుంచి ప్రత్యేకమైన 
ఆదేశాలేమీ రావడం లేదు. త్వరలోనే దీనిపై దృష్టి పెడుతం.

- ఇంటర్ బోర్డు అధికారి

చర్యలు తీసుకోవాలె

ప్రభుత్వ రూల్స్‌కు వ్యతిరేకంగా అకాడమీలను ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ల పేరుతో ఇంటర్ అడ్మిషన్లు చేస్తూ, లక్షల ఫీజులు వసూలు చేస్తూ కొత్త విద్యా వ్యాపారానికి తెరలేపారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా, ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారు. అక్రమంగా నడిస్తున్న అకాడమీలపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం. 
- జీవన్, ఏబీవీపీ లీడర్