
మనది రంగుల ప్రపంచం. ప్రకృతి బోలెడన్ని అందాలను మనకోసం సిద్ధం చేసి ఉంచుతుంది. వాటన్నింటినీ మనం ఎన్నో రకాలుగా ఆస్వాదిస్తూ ఉంటాం. మన ప్రకృతి ఎంత అందమైనదో అంతే చిత్రమైనది. పచ్చని అడవి, నల్లటి కొండ, ఫలానా రంగు అని తేల్చి చెప్పలేని నీళ్లు… ఇలా మనచుట్టూ ఎన్నెన్నో రంగులు. అయితే కలర్ బ్లైండ్నెస్ మనిషికీ రంగులకూ మధ్య అడ్డం పడుతుంది.
ఈ సమస్యతో బాధపడే వాళ్లు అన్ని రంగులనూ చూడలేరు.
కలర్ బ్లైండ్నెస్ని వైద్య భాషలో ‘ కలర్ విజన్ డెఫీషియన్సీ’ అంటారు. ఇది కొందరికి పుట్టుకతోనే వస్తుంది. మరికొందరికి కంటికి ఏదైనా గాయాలు తగలడం ద్వారా ఎటాక్ అవుతుంది. అయితే ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. దీని తీవ్రత తక్కువగా ఉన్న వాళ్లు కలర్స్‌లోని షేడ్స్‌ని కనిపెట్టడంలో మాత్రమే ఇబ్బంది పడుతుంటారు. తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్ని రంగులను పూర్తిగా చూడలేరు. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులను వీళ్లు చూసే అవకాశం తక్కువగా ఉంటుంది.
కోన్స్కు ఇబ్బంది ఎదురైతే…
కంటి రెటీనాలో రాడ్స్, కోన్స్ రెండు భాగాలుగా ఉంటాయి. ఇవే బ్రెయిన్‌కి విజువల్ సిగ్నల్స్‌ను పంపుతాయి. తక్కువ కాంతిలో ఉన్న వాటిని చూసే బాధ్యతను రాడ్స్ తీసుకుంటాయి. ఎక్కువ కాంతిలో ఉన్న వాటిని చూసే డ్యూటీని కోన్స్ తీసుకుంటాయి. కోన్స్‌లో మూడు రకాల ఫోటోపిగ్మెంట్లు ఉంటాయి. వీటిని ఆపిన్స్ అంటారు. ఇవే ఏ రంగును ఆ రంగులో చూపించడానికి పనిచేస్తాయి. ఇందులో మొదటిది యెల్లో, ఆరెంజ్ కలర్స్‌ను చూసేందుకు పనిచేస్తుంది. రెండోది యెల్లో, గ్రీన్ కలర్స్‌ను చూసేందుకు పనిచేస్తుంది. మూడోది నీలం, వైలెట్ కలర్స్‌ను చూసేందుకు పనిచేస్తుంది. ఇలా రెటీనాలో మేజర్ పనులన్నింటినీ కోన్స్ చూసుకుంటాయి. ఈ ప్రాసెస్‌కు అంతరాయం ఏర్పడితే అది కలర్ బ్లైండ్నెస్కు కారణం అవుతుంది. ఇది ఒక్కోసారి జీన్స్ వల్ల సంక్రమిస్తుంది. మరికొన్ని సార్లు కళ్లకు గాయాలు అవ్వడం వల్ల వస్తుంది. కొన్ని జబ్బుల వల్ల కూడా కలర్‌బ్లైండ్‌నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇలానూ రావొచ్చు…
కొన్నిసార్లు దీర్ఘకాలిక వ్యాధులు కూడా కలర్బ్లైండ్నెస్కు కారణమవుతాయి. అల్జీమర్స్, డయాబెటిస్, లుకేమియా, లివర్ వ్యాధులు, రెటినిటిస్ పిగ్మెంటోసా… లాంటి వాటి ప్రభావం కంటి రెటీనాలోని కోన్స్ మీద పడుతుంది. అదే కలర్బ్లైండ్నెస్కు కారణం అవుతుంది. వయసు పైబడుతున్న వాళ్లకూ ఇది ఎటాక్ అయ్యే ప్రమాదం ఉంది. రెటీనా మీద ప్రభావం చూపే బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. కెమికల్స్ ప్రభావం వల్ల కూడా కలర్‌బ్లైండ్‌నెస్ ఎటాక్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైసల్ఫైడ్ల రసాయనాలు కంట్లో పడ్డప్పుడు కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది.
ఇవీ రకాలు…
కలర్ బ్లైండ్నెస్లో మూడు రకాలున్నాయి. వాటిని ఎనోమలస్ ట్రైక్రోమసి, డైక్రోమసి, మోనోక్రోమసి అంటారు. ఎనోమలస్ ట్రైక్రోమసితో బాధ పడేవాళ్లు రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్‌ను చూడటానికి ఇబ్బందిపడతారు. డైక్రోమసితో ఇబ్బందిపడుతున్న వాళ్లు కలర్స్‌ను బాగానే చూడగలరు. కానీ రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్‌లో ఉండే లైట్‌ని చూడలేరు. ఇక మోనోక్రోమసి అత్యంత అరుదైన పరిస్థితి. దీని నుంచే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. దీంతో బాధపడుతున్న వాళ్లు ఏ రంగులనూ చూడలేరు. ఈ ప్రపంచం మొత్తాన్నీ నలుపు, తెలుపు రంగుల్లో చూడాల్సిందే.
ఇప్పటికి లేనట్టే…
కలర్ బ్లైండ్‌నెస్‌ను తగ్గించడానికి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. అవేవీ ఇప్పటి వరకూ విజయం సాధించలేదు. విజయం సాధించినట్టుగా ఇటీవల వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదని సైంటిస్టులు తేల్చిచెప్తున్నారు. వారసత్వంగా వచ్చిన కలర్ బ్లైండ్‌నెస్‌ను జెనోమ్ ట్రీట్మెంట్ సాయంతో నయం చేస్తామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. వాళ్లు ఆ ప్రయోగాన్ని కోతులపై చేశారు. మనుషులపై చేసి విజయం సాధించినట్టు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు.
ఈ మధ్యకాలంలో ఒక రకం కళ్లజోడును ధరించడం ద్వారా కలర్ బ్లైండ్‌నెస్‌ను గెలవవచ్చనే వార్తలు బాగా వినిపించాయి. ప్రముఖ హెల్త్ మ్యాగజైన్స్ కూడా ఆ ఆర్టికల్స్‌ను ప్రచురించాయి. అయితే వాటిలోనూ వాస్తవం లేదు. స్పెయిన్‌లోని గ్రెనడా యూనివర్సిటీలో 68 మంది కలర్ బ్లైండ్ ఉన్న వ్యక్తులపై పరిశోధన జరిగింది. అందులో ఈ కళ్లజోళ్ల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని, అవి సాధారణమైనవేనని తేలింది. కలర్ బ్లైండ్నెస్కు ఇప్పటివరకూ నివారణ లేదని, ఆ పేరుతో మోసం చేసే వారితో జాగ్రత్త అని… డాక్టర్లు చెబుతున్నారు.