ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ వెరబెల్లి

బెల్లంపల్లి,వెలుగు: రాష్ట్ర మంత్రి హరీశ్​రావు ఆర్థిక మంత్రి కాదని..  అబద్దాల మంత్రి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం రూ.30 వేల కోట్లు ఇవ్వకుండా నిలిపేసిందని హరీశ్​రావు చెప్పడం అర్థరహితమన్నారు. దీనిపై మంత్రి దగ్గర ఏదైనా లేఖ ఉంటే బయటపెట్టాలన్నారు. అది నిజమైతే తాను బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని సవాల్​విసిరారు. లేదంటే మంత్రి హరీశ్​రావు ముక్కు నేలకు రాయాలన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న హరీశ్​రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో 1200ల మంది ఆత్మ బలిదానానికి ఆయనే కారణమన్నారు. ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ 2014 లోనే  నిర్ణయం తీసుకున్నారన్నారు. సింగరేణి ఏరియాలకు ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్ టీ, సీఎస్ఆర్ నిధులు రూ. 10 కోట్లు సిద్దిపేటలో ఫుట్​బాల్​ కోర్టు కోసం ఎందుకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. 

సింగరేణి క్రికెట్ కప్ విజేత ఆర్కే7 

నసస్పూర్, వెలుగు: వాజ్​పేయి జయంతి సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ సహకారంతో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు నిర్వహించిన  క్రికెట్​టోర్నీ విజేతగా ఆర్కే7 మైన్  జట్టు నిలిచింది. శుక్రవారం ఫైనల్ మ్యాచ్ అనంతరం  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ వెరబెల్లి విజేత జట్టుకు రూ. 10 వేల నగదు, ట్రోఫీ, రెండో స్థానంలో నిలిచిన ఐకే1ఎ జట్టుకు రూ. ఐదువేల నగదు అందజేశారు. కార్యక్రమంలో పోనుగోటి రంగారావు, రజినీష్ జైన్, పిట్టల రవి, సత్రం రమేశ్, సదానందం, పానుగంటి మధు, బియ్యాల సతీశ్​రావు, రవనవేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు అండగా బీజేపీ

నిర్మల్,వెలుగు: బీసీలకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ లీడర్లు చెప్పారు. శుక్రవారం స్థానిక పార్టీ ఆఫీసులో బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ  సభ్యుడిగా  నియమితులైన అమరవేణి నర్సాగౌడ్ ను పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు రావుల రామనాథ్, అయ్యన్న గారి భూమయ్య, మెడిసిమ్మ రాజు, రాచకొండ సాగర్, సాదం అర్వింద్, అల్లం భాస్కర్, ఒడిసెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించం

హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదని భారత్​ దర్శన్​ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్​కుమార్, అయ్యప్ప స్వాములు, బీజేపీ లీడర్లు హెచ్చరించారు.  అయ్యప్ప స్వామిపై ఓయూ స్టూడెంట్​ బైరీ నరేశ్​చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.  - వెలుగు నెట్​వర్క్​

హీరాబెన్​కు నివాళి

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్​ మృతిపై ఉమ్మడి జిల్లాలో బీజేపీ లీడర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. భైంసాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్, బాల్కొండ నియోజకవర్గ పాలక్​ రామారావు పటేల్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్​ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆదిలాబాద్​లో సుహాసినిరెడ్డి, మంచిర్యాలలో రఘునాథ్​ వెరబెల్లి నివాళి అర్పించారు.  - వెలుగు నెట్​వర్క్​

వచ్చేది బీజేపీ సర్కారే

కాగజ్ నగర్,వెలుగు: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కౌటాల మండలం గురుడుపేటలో పలువురు బీఆర్ఎస్​లీడర్లు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దోని శ్రీశైలం, తాలుకా కన్వీనర్ వీరభద్రచారి, బోద్ ప్రబారి కొంగ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు చన్కపురి గణపతి, జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్ , మండల అధ్యక్షుడు వాను పటేల్, నాయకుడు హరీశ్​బాబు ఉన్నారు.

పాలకుల కారణంగానే సింగరేణికి ఇబ్బందులు

బెల్లంపల్లి,వెలుగు: పాలకుల కారణంగానే సింగరేణికి ఇబ్బందులు వచ్చిపడ్డాయని ఐఎన్​టీయూసీ సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి బి. జనక్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బెల్లంపల్లి శాంతిఖని గని ఆవరణలో నిర్వహించిన గేటు మీటింగ్ కు జనక్ ప్రసాద్ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. శాంతి గనిలో బోల్టర్ మైనింగ్ మోసపూరిత పద్ధతన్నారు. సింగరేణి కంపెనీ సొంతంగా ఎస్​డీఎల్​యంత్రాలు కొనుగోలు చేస్తే శాంతిఖని బావికి ఇంకా 40 ఏండ్ల జీవితకాలం ఉంటుందన్నారు. సమావేశంలో ఐఎన్టీయూసీ  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి రాజమౌళి,సెంట్రల్ జనరల్ సెక్రటరీ కాంపెల్లి  సమ్మయ్య, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, ఏరియా సెక్రటరీలు ఓదెలు , చంద్రశేఖర్, విక్రమ్, ఆరేపల్లి రామయ్య , కనకయ్య, అనిల్, పిట్ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీలను మోసం చేసిన బీఆర్​ఎస్​

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: బీఆర్ఎస్​లీడర్ల మాయమాటలకు ఆదివాసీలు మోసపోయారని ఎంపీ సోయం బాపూరావు ఫైర్​అయ్యారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆదివాసీల కష్టాలు దూరమవుతాయని భావించి బీఆర్ఎస్​ను గెలిపించారన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివాసీలతో వెట్టిచాకిరి చేయించుకొని చంచాగిరి చేసేటోళ్లకు పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోనేరావు, మార్కెట్ డైరెక్టర్ గేడం రాములు, పలువురు ఆదివాసీలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఎనిమిది మంది ఆదివాసీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. రాష్ట్రపతి పదవి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు ఇవ్వడం గర్వకారణమన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి బీఆర్ఎస్​ లీడర్లు మోసం చేశారన్నారు. కేంద్రం గ్రామాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో రైల్వేబోర్డు మెంబర్​ జీవీ రమణ, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

నాగోబా జాతరను సక్సెస్ చేయాలె

గుడిహత్నూర్,వెలుగు: నాగోబా జాతరను సక్సెస్​చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. గోపురాల నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముత్నూర్ నుంచి కేస్లాపూర్, మెండపెల్లి, హర్కాపూర్ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయించాలని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

భక్తులు కొవిడ్​ రూల్స్​పాటించేలా అవేర్నెస్​కల్పించాలన్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే నెల 24న నిర్వహించే దర్బార్​కు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. విద్యుత్​సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మీటింగ్ లో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో సురేశ్, ఏపీవో జనరల్ భీంరావు, డీడీ దిలీప్ కుమార్, ఈవో  రాజమౌళి, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్ రేణుక, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, డీపీవో శ్రీనివాస్, ఓఎస్డీ కృష్ణయ్య, అడిషనల్ డీఎంహెచ్​వో మనోహర్, ఏవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

డీఎఫ్​వో దినేశ్​కుమార్ బదిలీ

ఆసిఫాబాద్,వెలుగు: ఆసిఫాబాద్ డీఎఫ్​వో దినేశ్​కుమార్ కేరళ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. శుక్రవారం ఆయనను సీఎఫ్​వో​వినోద్​ కుమార్​ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఇన్​చార్జి డీఎఫ్​వోగా మంచిర్యాలకు చెందిన శివ ఆశీస్ ​సింగ్​కు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమలో జిల్లాలోని అన్ని రేంజిల ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.