స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తరు ? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తరు ? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • సర్కార్ నిర్ణయం కోసం ఈసీ ఎదురుచూస్తున్నది
  • ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిన నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఎన్నికల సంఘం ఎదురుచూస్తున్నదని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు డిసైడ్ కావడం లేదని ప్రశ్నించింది.. ఎన్నికలను ఎప్పటిలోగా నిర్వహిస్తారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ను నిలిపివేస్తూ గత నెల 9న ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌‌‌ను సవాలు చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షేట్టిపల్లి మండలానికి చెందిన ఆర్‌‌‌‌.సురేందర్‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

దీనిపై చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జీఎం మొహియుద్దీన్‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్ వెంకటయ్య వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరితో ముగిసిందని, ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్ జి.విద్యాసాగర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌‌‌‌లను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించిందని తెలిపారు. 25 శాతం బీసీ రిజర్వేషన్‌‌‌‌ల ప్రకారం వార్డుల కేటాయింపు జరిపి జాబితా అందిస్తే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్‌‌‌‌ జడ్జి ఆదేశాలతోనే నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసినట్లు తెలిపారు. అయితే, 42 శాతం బీసీ రిజర్వేషన్‌‌‌‌లను ఈ కోర్టు రద్దు చేసిందని, దీంతో పాత రిజర్వేషన్‌‌‌‌ల ప్రకారం ప్రభుత్వం పంచాయతీలు, వార్డుల కేటాయింపు జరిపి జాబితా ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, వారం గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దీనిపై బెంచ్‌‌‌‌ స్పందిస్తూ.. వారం గడువు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే.. ఎన్నికలను ఎప్పుడు నిర్ణయిస్తామన్నది చెప్పాలంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.