ఆన్లైన్లో దీపావళి పండుగ దొంగలు..క్రాకర్స్ 70 శాతం డిస్కౌంట్ అంటూ బురిడీ

ఆన్లైన్లో దీపావళి పండుగ దొంగలు..క్రాకర్స్ 70 శాతం డిస్కౌంట్ అంటూ బురిడీ
  •   నకిలీ  వైబ్​సైట్లతో బోల్తా కొట్టిస్తున్న ఫ్రాడ్స్..
  •     ఈ-మెయిల్, టెలిగ్రామ్, వాట్సాప్​కు లింక్స్​ 
  •     క్లిక్ చేస్తే అకౌంట్లు ఖాళీ  

హైదరాబాద్​సిటీ, వెలుగు:  పండుగల సీజన్ వచ్చిందంటే చాలామంది తక్కువ ధరలు, డిస్కౌంట్లకు ఆశపడి నచ్చిన వస్తువులు, గ్రాసరీ కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు అంతా ఆన్​లైన్​ కావడంతో ఈ సిట్యుయేషన్​ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకుని దోచుకుంటున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలను టార్గెట్ చేస్తూ జనాలను బోల్తా కొట్టిస్తున్నారు. మరో రెండు రోజుల్లో దీపావళి ఉండడంతో వేలాది మంది ఫోన్లకు ‘బంపర్ ఆఫర్లు’, 'భారీ తగ్గింపులు' అంటూ మెసేజ్ లు పంపి లక్షల్లో దోపిడీ చేస్తున్నారు.  

క్రాకర్స్, షాపింగ్ ఆఫర్ల మాటున మోసం

సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది దీపావళిని టార్గెట్ చేస్తూ క్రాకర్స్‌‌ (పటాకుల)పై ఏకంగా 70 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉన్నట్లు ఆన్‌‌లైన్ మెసెజ్ లు పంపిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌‌సైట్లను పోలిన నకిలీలను రూపొందించి పెడుతున్నారు. యాప్స్​వాడని వారు ఎవరైనా సెర్చ్​చేస్తే ముందు అవ్వే ప్రత్యక్షమవుతున్నాయి. అందులో డెడ్​చీప్, పండుగ స్పెషల్ డీల్, లక్కీ డ్రా విన్నర్ అంటూ ఊదరగొడుతున్నారు. వీటిని నమ్ముతున్న చాలామంది బుక్​చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బుక్​చేసిన వారి డిటెయిల్స్​తీసుకుని కాల్​చేసి ఏపీకే లింక్స్​పంపించి మళ్లీ బురిడీ కొట్టిస్తున్నారు. 

ఇలా మోసం చేస్తరు

పండుగ ఆఫర్లు అంటూ  చాలామంది -మెయిల్, టెలీగ్రామ్, వాట్సాప్​కు సైబర్​ క్రిమినల్స్​ ఫేక్​ లింక్స్​ పంపిస్తున్నారు. క్లిక్ చేస్తే, అది నిజమైన వెబ్‌‌సైట్‌‌లా కనిపించే ఫేక్ పేజీకి వెళ్తుంది. ఆ పేజీలో వినియోగదారుడిని ఆఫర్ పొందడానికి లేదా కొనుగోలు చేయడానికి వ్యక్తిగత వివరాలు (పేరు, చిరునామా) బ్యాంకు వివరాలు(డెబిట్/క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, ఓటీపీ) నమోదు చేయమని కోరతారు. బాధితులు వివరాలను నమోదు చేయగానే, ఆ సమాచారం నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. అంతే, క్షణాల్లోనే వారి అకౌంట్‌‌లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. కొంతమంది కేటుగాళ్లు 'గిఫ్ట్ కూపన్' పొందడానికి ముందుగా కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించాలని కోరి, ఆ తర్వాత మొత్తం అకౌంట్‌‌ను కొల్లగొడుతున్నారు.

ప్రయాణాలు, ఇతర వస్తువుల పేరిట దోపిడీ

వస్తువుల కొనుగోలుతో పాటు, పండుగల సందర్భంగా ప్రయాణాలు చేయాలనుకునే వారిని కూడా సైబర్​కేటుగాళ్లు వదలడం లేదు. ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్, రైలు టికెట్లపై భారీ తగ్గింపు ప్రకటిస్తూ నకిలీ ఆన్‌‌లైన్ ఆఫర్లతో నిండా ముంచుతున్నారు. ఇటీవల ఈ తరహాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు తెలిపారు.

ఇవీ జాగ్రత్తలు :  

  •     తెలియని నంబర్ల నుంచి, అనుమానాస్పద ఈ-మెయిల్ ఐడీల నుంచి వచ్చే ఎలాంటి ఆఫర్ లింక్స్‌‌ లేదా మెసెజ్ లను నమ్మవద్దు, వాటిని క్లిక్ చేయవద్దు.
  •     ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే, ఆయా కంపెనీల అఫీసియల్ యాప్స్, వెబ్‌‌సైట్ల యూఆర్​ఎల్​సరిచూసుకున్న తర్వాతే నేరుగా వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లి కొనుగోలు చేయాలి.  
  •     ఎలాంటి ఆఫర్ల కోసమైనా సరే.. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, లేదా పాస్‌‌వర్డ్‌‌ అడిగితే వెంటనే ఆ పేజీని క్లోజ్​చేయండి. ఏ బ్యాంకు లేదా చట్టబద్ధమైన సంస్థ ఓటీపీని ఫోన్ ద్వారా అడగదు.
  •     భారీ తగ్గింపులు కనిపిస్తే, అది నిజమో కాదో ఆ కంపెనీ కస్టమర్ కేర్‌‌కు ఫోన్ చేసి లేదా అధికారిక సోషల్ మీడియా పేజీలో అడిగి నిర్ధారించుకున్న తర్వాతే కొనాలి.

సికింద్రాబాద్​కు చెందిన 29 ఏండ్ల మహిళకు ఫ్యాషన్​ షాపింగ్ సైట్ ఎగ్జిక్యూటివ్స్​పేరుతో సైబర్​ నేరగాళ్ల నుంచి కాల్ వచ్చింది. ఆమె పండుగ కోసం కొన్న వస్తువు పేరు చెప్పి ప్రత్యేక గిఫ్ట్ కింద ఐఫోన్​ వచ్చిందని నమ్మించారు. అయితే, డిస్పాచ్ కోసం రూ9,840 జీఎస్టీ చార్జీలు చెల్లించాలని కోరారు. తర్వాత డెలివరీ చార్జీలు, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్​ అంటూ ఆమె దగ్గర రూ.1.40 లక్షలు కొట్టేశారు. చివరకు తాను మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

అజంపురాకు చెందిన 69 ఏండ్ల ఓ వ్యక్తి  పండుగకు డ్రైఫ్రూట్స్, ఇతర గ్రాసరీ కోసం బ్లింకిట్​లో కొనుగోలు చేసిన వ్యక్తి.. ఒక వస్తువు రాకపోవడంతో గూగుల్​లో ఆ కంపెనీ కస్టమర్ ​కేర్​నంబర్​ కోసం వెతికాడు. అయితే, సైబర్​ ఫ్రాడ్స్​ తమ నంబర్​ వచ్చేలా పెట్టడంతో దానికి కాల్​చేశాడు. సపోర్ట్ స్టాఫ్‌‌గా నటించిన మోసగాళ్లు, వాట్సాప్ ద్వారా ఏపీకే లింక్‌‌ పంపి, ఇన్‌‌స్టాల్ చేయమని సూచించారు. ఇన్‌‌స్టాల్ చేసిన తర్వాత, అతని కుటుంబ సభ్యుల ఫోన్లకు రిమోట్ యాక్సెస్ పొంది, వారి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.1.02 లక్షలు కొట్టేశారు.