- ఈ నెల 13న నాలుగో పవర్ ప్లాంట్ సీఓడీ కంప్లీట్
- రాబోయే 20 రోజుల్లో చివరి ఐదో ప్లాంట్ సింక్రినైజేషన్
రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే కీలక ప్రాజెక్ట్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పనులను వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలుకాగా.. 13న నాలుగో యూనిట్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే కీలక ప్రాజెక్ట్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పనులను వచ్చే నెల 5 లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడు యూనిట్లతో పాటు, ఈ నెల 13న నాలుగో యూనిట్‌లో కమర్షియల్ ఆపరేషన్ మొదలైంది. మరో 20 రోజుల్లో ఐదో యూనిట్‌ను సింక్రనైజ్ చేయడానికి ఇంజినీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అది పూర్తయితే మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో వైటీపీఎస్ అందుబాటులోకి రానుంది.
నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. జెన్‌కో ఆధ్వర్యంలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లు నిర్మించేందుకు రూ.29 వేల కోట్లు కేటాయించారు.
2017లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భేల్)తో పనుల ఒప్పందాలు కుదుర్చుకొని, పనులు చేసినా.. గడువులోగా పూర్తికాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో యూనిట్‌ను సింక్రనైజ్ చేస్తూ పనులు ముందుకు సాగించారు. 2025 జనవరి 25న తొలి 800 మెగావాట్ల యూనిట్ లో సీఓడీ పూర్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
అదే ఏడాది జులై 12న రెండో యూనిట్, తర్వాత మూడో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. తాజాగా నాలుగో యూనిట్ నుంచి కూడా ఉత్పత్తి మొదలైంది. ఐదో యూనిట్‌ను వచ్చే నెల 5వ తేదీలోపు సింక్రనైజ్ చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలో పెరిగిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
యాదాద్రి నాలుగో యూనిట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 7,180 మెగావాట్లకు పెరిగిందని జెన్‌కో అధికారులు తెలిపారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 1,800 మెగావాట్లు, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (చెల్పూర్) ద్వారా 1,100 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 1,080 మెగావాట్లు, యాదాద్రి నాలుగు యూనిట్ల ద్వారా 3,200 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటికే మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, నాలుగో యూనిట్ సీఓడీ పూర్తికావడంతో మొత్తం సామర్థ్యం 3,200 మెగావాట్లకు పెరిగిందని జెన్‌కో సీఎండీ హరీశ్ అన్నారు. మిగిలి ఉన్న చివరి యూనిట్ పనులపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు సీఎండీ చెప్పారు.
