ఆబ్కారీ శాఖ వ్యాట్ ఎగ్గొడ్తున్నది

ఆబ్కారీ శాఖ వ్యాట్ ఎగ్గొడ్తున్నది
  • ప్రభుత్వానికి కమర్షియల్ ట్యాక్స్ అధికారుల నివేదిక
  • అవగాహన లేకుండా  ఆరోపణలు చేస్తున్నరని కమర్షియల్ ట్యాక్స్ 
  • డిపార్ట్​మెంట్​పై ఎక్సైజ్ శాఖ ఫైర్
  • వ్యాట్ పక్కాగా కడ్తున్నామని సర్కార్​కు రిపోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ మధ్య వ్యాట్ విషయంలో వివాదం మరింత ముదురుతున్నది. ఎంత లిక్కర్ అమ్ముతున్నామో.. అంతే వ్యాట్ కడ్తున్నామని ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ చెప్తుంటే.. ఏదో తేడా కొడ్తున్నదని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ ఆరోపిస్తున్నది. వ్యాట్​పై కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అవగాహన లేదని, తప్పుడు లెక్కలు సృష్టిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు మండిపడుతున్నారు. దీంతో ఎవరికి వారే రాష్ట్ర సర్కార్​కు వ్యాట్ లెక్కలు తీసి నివేదికల రూపంలో తాజాగా అందజేశారు. టానిక్ ఎలైట్ వైన్స్​లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీ చేసినప్పటి నుంచి ఈ రెండు శాఖల మధ్య కోల్డ్​వార్ మొదలైంది. ఎక్సైజ్ వ్యాట్ విషయంలో లెక్కలు సరిగ్గా లేవంటూ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నారు. మద్యం డిపోల నుంచి లిక్కర్ తరలించే వెహికల్స్ కచ్చితంగా ఈ–వే బిల్లులు క్యారీ చేయాలని సర్క్యూలర్ కూడా ఇచ్చారు. 

డిస్టలరీల్లో గోల్​మాల్ జరుగుతున్నది: కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్

ఒకట్రెండు రోజుల కింద రెండు డిస్టలరీలను ఎక్సైజ్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వకుండానే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. ఎంత లిక్కర్ తయారు చేశారు.. ఉపయోగించిన డీ మినరలైజ్డ్ వాటర్ ఎంత? అనే వివరాలు సేకరించారు. ఉత్పత్తి అయిన లిక్కర్​కు.. వినియోగించిన డీ మినరలైజ్డ్ వాటర్ మధ్య తేడా ఉన్నట్టు గుర్తించారు. వాటర్ ఎక్కువ ఉండగా.. లిక్కర్ ప్రొడక్షన్ అందుకు తగ్గట్టు లేదని తేల్చారు. దాదాపు కోటి లీటర్ల లిక్కర్​కు సంబంధించిన వ్యాట్​ను ఎగ్గొట్టినట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన డిస్టలరీల్లో తనిఖీ చేస్తే అసలు విషయాలు బయటికి వస్తాయని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ (బేవరేజెస్ కార్పొరేషన్) ఆదాయం ప్రతి ఏటా పెరుగుతుంటే.. వ్యాట్ చెల్లింపుల్లో గ్రోత్ లేదని చెప్పారు. ఈ మేరకు కంప్లీట్ రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. అన్ని డిస్టలరీల్లో తనిఖీలు చేస్తే ఎంత వ్యాట్ ఎగ్గొట్టారనే దానిపై స్పష్టత వస్తుందని రిపోర్ట్​లో పేర్కొన్నట్టు సమాచారం. 

ప్రతి బాటిల్​పై వ్యాట్ వసూలు అవుతున్నది: ఎక్సైజ్ డిపార్ట్​మెంట్

సేల్ అవుతున్న ప్రతి మద్యం బాటిల్​కు వ్యాట్ పక్కాగా వసూలు అవుతున్నదని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ ప్రభుత్వానికి నివేదిక రూపంలో తెలిపింది. కాకపోతే.. మద్యం అమ్మకాలపైనే వ్యాట్ వసూలు ఉంటుందని, వైన్స్ టెండర్లు, లైసెన్స్ ఫీజు, పెనాల్టీలు, ఇతరత్రా వంటి వాటిపై వ్యాట్ చెల్లింపులు ఉండవని చెప్పింది. కొన్నేండ్లుగా ఇదే నిబంధన కొనసాగుతున్నదని నివేదించింది. అందులో భాగంగానే ఎక్సైజ్ ఆదాయం పెరిగినట్లుగా వ్యాట్ అదే స్థాయిలో కనిపించడం లేదని ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. తమ అనుమతి లేకుండా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు రెండు డిస్టలరీల్లో తనిఖీలు చేశారని నివేదికలో ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ పేర్కొంది. లిక్కర్ తయారీకి ఎంత వాటర్ అవసరం అవుతుంది? డిస్టలరీల్లో వాటర్​ను ఇంకా ఏయే అవసరాలకు ఉపయోగిస్తారు? లిక్కర్​లో వాటర్ పర్సంటేజీ ఎంత? ఈఎన్ఏ ఎంత? అనే వివరాలు తెలుసుకోకుండానే తప్పుడు నిర్ధారణకు వచ్చారని వివరించింది. అమ్ముతున్న ప్రతి లిక్కర్ బాటిల్​పై వ్యాట్ ముందే వసూలు అవుతుందని స్పష్టం చేసింది. అవసరమైతే మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తామని కూడా నివేదికలో చెప్పినట్టు సమాచారం. ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ అధికారులు ఏదో తప్పు చేసినట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆరోపించడం సరికాదని నివేదికలో చెప్పినట్టు తెలిసింది.