జీహెచ్ఎంసీ అవినీతి  అధికారులపై కమిషనర్ ఫోకస్

జీహెచ్ఎంసీ అవినీతి  అధికారులపై కమిషనర్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో అవినీతి  అధికారులపై  చర్యలు తీసుకునేందుకు కమిషనర్​లోకేశ్ కుమార్ ఫోకస్ చేశారు. అన్ని జోన్లు, సర్కిళ్ల పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల వరుసగా అధికారులు, సిబ్బంది అవినీతి  బయటపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే  నెలరోజుల్లోనే  ఆరుగురిపై వేటు వేశారు. అక్రమంగా బర్త్​ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఏఎంహెచ్ వోను  జీహెచ్ఎంసీ నుంచి తొలగించారు.  కూకట్ పల్లి జోన్ లో కాంట్రాక్టర్లు డిపాజిట్ చేసిన డీడీలను తప్పుదారి పట్టించినట్లు గుర్తించి ఒకేసారి నలుగురిని సస్పెండ్​ చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన కమిషనర్ ఇంకొందరిపై చర్యలు తీసుకోనున్నారు.  ముందుగా  డిప్యుటేషన్ పై బల్దియా కు వచ్చిన ఆఫీసర్ల పై  ఫోకస్ పెట్టారు. ఇటీవల విజిలెన్స్​ విచారణ కూడా డిప్యుటేషన్​పై వచ్చిన ఆఫీసర్లపైనే కొనసాగడంతో వీరిని సొంత డిపార్టుమెంట్​ కి పంపించడం లేదా బదిలీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఒకే సర్కిల్, ఒకే పోస్టులో ఐదారేండ్లుగా  పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. త్వరలోనే అన్ని సర్కిళ్లలో బదిలీలు కూడా జరగనున్నట్లు తెలిసింది.