ట్రాక్టర్ల కొనుగోళ్లలో కమీషన్లు!

ట్రాక్టర్ల కొనుగోళ్లలో కమీషన్లు!

సర్పంచ్‌‌లకు భారీగా ఆఫర్లు ఇస్తున్న కంపెనీలు
కంపెనీ పేరిట తీర్మానం చేస్తే 50 వేల వరకూ నజరానా
మీకెందుకు మేం చూసుకుంటామంటున్న ఎమ్మెల్యేలు!
ఇది కూడా దక్కనివ్వరా అంటూ కొందరు సర్పంచ్‌‌ల గుర్రు

హైదరాబాద్‌‌, వెలుగుగ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలు పథకంలో కమీషన్ల దందా నడుస్తోంది. ట్రాక్టర్‌‌ కంపెనీల మధ్య పోటీ కొందరు సర్పంచ్‌‌లకు కాసుల వర్షం కురిపిస్తోంది. గ్రామాల్లో చెత్త తరలింపు, హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు గ్రామానికో ట్రాక్టర్‌‌, ట్రాలీ, ట్యాంకర్‌‌ కొనుగోలుకు ప్రభుత్వం అక్టోబర్‌‌ 14న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ జనాభా ఆధారంగా ట్రాక్టర్‌‌ హార్స్‌‌ పవర్‌‌, కొనుగోలు చేయాల్సిన పద్ధతిపై  మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

రాష్ట్రంలో 12,753 గ్రామపంచాయతీలుండగా, వీటిలో కొన్ని పెద్ద గ్రామాలకే సొంత ట్రాక్టర్లు ఉన్నాయి. మొత్తంగా సుమారు 12 వేలకుపైగా గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కొనాల్సి ఉంది. 500కుపైగా జనాభా ఉన్న గ్రామాలకు 15 హెచ్‌‌పీ మినీ ట్రాక్టర్‌‌, 500 నుంచి 3000లోపు జనాభా ఉన్న గ్రామాలకు 20-–21 హెచ్‌‌పీ ట్రాక్టర్‌‌, 3 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామానికి 35–40 హెచ్‌‌పీ సామర్థ్యం కలిగిన రెగ్యులర్‌‌ ట్రాక్టర్‌‌ను కొనాలి. ట్రాక్టర్లతోపాటు రూ.2 లక్షల వరకు విలువ చేసే 5 వేల లీటర్ల నీటిసామర్థ్యం కలిగిన ట్యాంకర్‌‌ను కూడా కొనుగోలు చేస్తున్నారు.

ఊర్లమీద పడ్డ షోరూమ్‌‌ ఏజెంట్లు

ట్రాక్టర్ల కొనుగోలు కోసం ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌‌గా కలెక్టర్‌‌, డీఆర్‌‌డీఓ, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్‌‌, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌‌ సభ్యులుగా జిల్లా పంచాయతీ అధికారి మెంబర్‌‌ కన్వీనర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ లీడింగ్‌‌ బ్రాండ్స్‌‌కు చెందిన ట్రాక్టర్‌‌ కంపెనీల నుంచి వివరాలు తీసుకుని ధరలను నిర్ణయిస్తుంది. కానీ క్షేత్ర స్థాయిలో ట్రాక్టర్ల కంపెనీల ఎంపికను  సర్పంచ్‌‌లకే వదిలేశారు. వారిచ్చిన తీర్మానం ప్రకారమే ట్రాక్టర్ల కొనుగోలు జరుగుతుంది. దీంతో ఆయా ట్రాక్టర్‌‌ కంపెనీల డీలర్లు, ఏజెంట్లు సర్పంచ్‌‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో జిల్లాలో 300 నుంచి 600 వరకు గ్రామాలు ఉండడంతో ట్రాక్టర్‌‌ కంపెనీల డీలర్లు పోటీపడి సర్పంచ్‌‌లకు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలిసింది. తమ కంపెనీ ట్రాక్టర్‌‌నే కొనుగోలు చేస్తామని తీర్మానం చేస్తే వెంటనే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. డీలర్ల మధ్య ఉన్న పోటీని సర్పంచ్‌‌లు కూడా తమకు అనుకూలంగా మార్చుకుని కమీషన్ల కోసం డిమాండ్‌‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కూడా కొంత పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోటీపడి అగ్రిమెంట్స్‌‌

మహబూబాబాద్‌‌ జిల్లాలోని ఓ గ్రామ జనాభా 3 వేల కంటే ఎక్కువ ఉండటంతో తమకు 35 లేదా -40 హార్స్‌‌ పవర్‌‌ ట్రాక్టర్‌‌ కావాలని జిల్లా కేంద్రంలోని బ్రాండెడ్‌‌ కంపెనీ షోరూమ్‌‌కు ఆ గ్రామ సర్పంచ్‌‌ వెళ్లాడు. జిల్లా ట్రాక్టర్ల కొనుగోలు కమిటీ నిర్ణయించిన ధరకే అగ్రిమెంట్‌‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో మరో కంపెనీ ఏజెంట్‌‌ సదరు సర్పంచ్‌‌ దగ్గరికి వెళ్లి తమ కంపెనీ ట్రాక్టర్‌‌ కొంటే రూ.40 వేలు ఇస్తానని అనడంతో ఆ సర్పంచ్‌‌ పాత అగ్రిమెంట్‌‌ క్యాన్సిల్‌‌ చేసుకుని, కమీషన్‌‌ ఇస్తున్న కంపెనీ ట్రాక్టర్‌‌ కొనేందుకు అగ్రిమెంట్‌‌ చేసుకున్నాడు.

కమీషన్లు చూసి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యేలు

పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు వ్యవహారంలో నేరుగా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం కొన్ని నియోజకవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  ట్రాక్టర్‌ కంపెనీలను మేమే సెలక్ట్‌ చేస్తామని, తీర్మానం కాపీలో కంపెనీ పేరు కాలమ్‌ ఖాళీగా వదిలేయాలంటూ సర్పంచ్‌లను ఆదేశిస్తున్నారు. కొందరు సర్పంచ్‌లు సరే అంటున్నా.. ఇదొక్కటి మాకు వదిలేయండన్నా అంటూ కొందరు బతిమాలుకుంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సుమారు 70 నుంచి 90 గ్రామ పంచాయతీలుంటాయి. వీటన్నింటికీ టోకున ‘మాట్లాడుకుంటే’ ఒకేసారి పెద్ద మొత్తంలో కళ్లచూడొచ్చని ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారని సర్పంచ్‌లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.