ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు నిజమే: త్రిసభ్య కమిటీ

ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు నిజమే:  త్రిసభ్య కమిటీ

ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లింది నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. అవన్నీ అపోహలంటూ ఇంటర్​ బోర్డు చేసిన వాదనలు తప్పని స్పష్టం చేసింది. ఇంటర్‌ బోర్డు అధికారులు, గ్లో బరీనా సంస్థ నిర్లక్ష్యంతో తప్పులు జరిగాయని , దాంతో స్టుడెంట్లు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొందని తేల్చి చెప్పింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెసింగ్ ను కూడా గ్లో బరీనాకు అప్పగిస్తే.. తప్పులు కొనసాగే అవకాశముందని,  అందువల్ల ఆ సంస్థతోపాటు మరో ఏజెన్సీతో ఫలితాల డేటా ప్రాసెసింగ్‌‌ చేయించాలని సూచించింది. రెండింటిలోని ఫలితాలను బేరీజు వేసి.. అవి సరిపోతేనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్​ ఫలితాల వివాదంపై టీఎస్‌ టీఎస్‌ ఎండీ వెంకటేశ్వర్​రావు,  ప్రొఫెసర్‌ నిశాంత్‌,  ప్రొఫెసర్‌ ఎ.వాసన్‌‌ లతో ఏర్పాటు చేసిన కమిటీ శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

అన్ని కోణాల్లో పరిశీలించి ..

ఇంటర్​ ఫలితాల్లో ఏపీ, ఏఎఫ్ వంటి అక్షరాలురావడం, మెరిట్ విద్యార్థులు కూడా ఫెయిలైనట్టు చూపడం, తక్కువ మార్కులు వేయడం వంటి వాటిపై తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపై స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు చేశారు. ఇంటర్ లో ఫెయిలయ్యామన్నఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో నిరసనలు తీవ్రమయ్యాయి. స్పందించినసర్కారు.. ముగ్గురు నిపుణులతో కమిటీ వేసింది . ఆ కమిటీ ఇంటర్‌‌ బోర్డుతో పాటు గ్లోబరీనా సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేసింది. అధికారులు, సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు సేకరించి, నివేదికను తయారుచేసింది. శనివారం నివేదికను విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అందించారు.

ఆరు సూచనలు..
కమిటీ తమ పది పేజీల నివేదికలో ఆరు కీలకసూచనలు చేసింది. జనార్దన్ రెడ్డి ఈ సూచనలపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు. తర్వాత సీఎస్‌జోషిని కలిసి నివేదిక వివరాలను వెల్లడించారు. అయితే నివేదిక విడుదల జాప్యం పై సందేహాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. శనివారం రాత్రి ఇంటర్‌‌ బోర్డు ఆఫీసులో బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌‌తో కలిసి జనార్దన్ రెడ్డి కొన్ని అంశాలను వెల్లడించారు. ‘‘కమిటీ ఇచ్చిన సిఫార్సులను వెంటనే అమలుచేయాలని బోర్డు అధికారులను ఆదేశించాం . గ్లో బరీనా ఏజెన్సీతో కుదుర్చుకున్న డేటా ప్రాసెసింగ్‌ ఒప్పందానికి గానూ ఇంకా డబ్బు చెల్లించలేదని బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్షోభ పెట్టినందుకు ఆ ఏజెన్సీపై కచ్చితంగా చర్యలుతీసుకుంటాం ’’ అని జనార్దన్‌‌రెడ్డి చెప్పారు . గడిచిన సంవత్సరాలకు, ఇప్పుడు వచ్చిన ఫలితాలకు పెద్దగాతేడా లేదని వివరించారు. 2018లో 64.73 శాతం ఉత్తీర్ణత ఉంటే, ఈ ఏడాది 62.29 శాతం నమోదైందన్నారు. ఇంటర్ బోర్డు ఫలితాల్లో కొన్ని తప్పులను గుర్తించి, రెండు, మూడు గంటల్లోనే సరిచేసిందని.. కానీ ఆ కాపీలను మీడియాకు ఇవ్వక పోవడంతో తప్పులు ఎక్కువగా వచ్చినట్టయిందని వివరించారు.