- నూతన సంవత్సరాన్ని మానవత్వంతో ప్రారంభించాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్‌ను ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. గురువారం సెక్రటేరియెట్‌లో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో సెర్ప్ డైరెక్టర్లు, సిబ్బంది మంత్రిని కలిసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బొకే కాకుండా తెలంగాణ నేతన్నలు తయారు చేసిన దుప్పటిని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెర్ప్ డిపార్ట్‌మెంట్ ద్వారా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి బొకేలు కాకుండా శాలువలు, దుప్పట్లు ఇవ్వాలని సూచించారు.
అలా అందే దుప్పట్లు పేద విద్యార్థులు, చలితో వణికే పిల్లలకు ఉపయోగపడతాయన్నారు.“బొకేలు వద్దు– బ్లాంకెట్లు ఇవ్వండి” అంటూ ఆమె పిలుపునిచ్చారు. శాలువలు, దుప్పట్లు సులభంగా లభించేలా సెక్రటేరియట్ ముందు టెస్కో ద్వారా ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పేదల చిరునవ్వే నిజమై న నూతన సంవత్సర శుభాకాంక్షలని, చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు దారి తీస్తుందని చెప్పారు.
