ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సిగరెట్ ధరలు

ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సిగరెట్ ధరలు

న్యూఢిల్లీ:   సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం సవరించిన సుంకాలను నోటిఫై చేసింది. సిగరెట్ పొడవు ఆధారంగా ఈ పన్నుల విధింపు ఉంటుంది. దీనివల్ల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతాయి. 65 మిల్లీమీటర్ల వరకు పొడవున్న వెయ్యి సిగరెట్ల డబ్బాకు రూ.2700 నుంచి రూ.మూడు వేల వరకు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ఇదే అత్యంత తక్కువ పన్ను కేటగిరీ. 70 నుంచి 75 మిల్లీమీటర్ల లోపు పొడవున్న సిగరెట్లపై సుంకం రూ.ఏడు వేల వరకు ఉంటుంది. ఇతర కేటగిరీలకు అత్యధికంగా రూ.11 వేల పన్ను విధిస్తారు.   ఈ పన్ను భారాన్ని వినియోగదారులపై వేస్తే ఒక్కో సిగరెట్ పై పన్ను రూ.2.7 నుంచి రూ.11 వరకు ఉండవచ్చు. చిన్న సిగరెట్లపై తక్కువ ధరలు పెరిగే అవకాశం ఉండగా, పొడవైన ప్రీమియం సిగరెట్లు బాగా ప్రియం కానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గోల్డ్​ ఫ్లాక్​ కింగ్ సైజ్ సిగరెట్ ధర సుమారు రూ.17 నుంచి రూ.18 వరకు ఉంది. కంపెనీలు పన్ను భారాన్ని పూర్తిగా వినియోగదారులపైకి మళ్లిస్తే, వచ్చే నెల నుంచి ఒక్కో సిగరెట్ ధర రూ.23 నుంచి రూ.25 వరకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీలు తమ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు ఈ ధరల పెంపును విడతలవారీగా చేసే అవకాశం ఉంది. 

గుట్కాల ధరలు కూడా..

గుట్కాపై 91 శాతం, నమలగల పొగాకుపై 82 శాతం, జర్దా సుగంధ పొగాకుపై 82 శాతం అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు. ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. కేంద్ర పన్ను ఆదాయంలో 41 శాతాన్ని రాష్ట్రాలకు కేటాయిస్తారు. పాన్ మసాలా తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంపై హెల్త్ సెస్ విధిస్తారు. ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అవగాహన లేదా ఇతర ఆరోగ్య సంబంధిత పథకాల ద్వారా రాష్ట్రాలకు అందజేస్తారు. ప్రస్తుతం పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు వంటి ఉత్పత్తులపై 28 శాతం జీఎస్​టీతో పాటు వివిధ రేట్లలో కాంపెన్సేషన్ సెస్ అమల్లో ఉంది.