బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దాడులు..2 వారాల్లో నలుగురిపై అటాక్

బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దాడులు..2 వారాల్లో నలుగురిపై అటాక్
  • తాజాగా మరో వ్యక్తిపై కత్తులతో దాడి
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
  • చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు
  • దాడులను ఖండించిన  ప్రపంచ దేశాలు

ఢాకా: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కిందపడేసి తీవ్రంగా చితకబాదారు. ఆ తర్వాత  పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితుడు దగ్గరలోని చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటన షరియత్‌‌పుర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. 

50 ఏండ్ల ఖోకన్‌‌ దాస్‌‌.. తన పని ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. కొందరు గుంపుగా వచ్చి  అతడిని అడ్డుకున్నారు. పేరు, ఊరు అడిగి బూతులు తిట్టారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి, సజీవ దహనానికి యత్నించారు. అతికష్టం మీద తప్పించుకున్న  దాస్.. దగ్గరలోని చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు అతన్ని కాపాడి షరియత్‌‌పూర్ సదర్ హాస్పిటల్​కు తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు.. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

2 వారాల్లో ముగ్గురు మృతి

బంగ్లాదేశ్ లో రెండు వారాల్లో నలుగురు హిందువులపై దాడులు జరిగాయి. కాలిమోహర్​లోని హుస్సేన్​దంగాలో డిసెంబర్ 24న 29 ఏండ్ల అమృత్ మండల్​పై కొందరు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అమృత్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. మైమెన్​సింగ్​ సిటీలోని డిసెంబర్ 18న 25 ఏండ్ల దీపూ చంద్ర దాస్​పై కొందరు దాడి చంపేశారు. ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు. అలాగే డిసెంబర్‌‌ 29న మైమెన్‌‌సింగ్‌‌ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్‌‌ లిమిటెడ్‌‌ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్‌‌గా పనిచేసే 42 ఏండ్ల బజేంద్ర బిశ్వాస్‌‌ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్‌‌ అయిన 29 ఏళ్ల నోమన్‌‌ మియా తన సర్వీస్ షాట్‌‌గన్‌‌తో కాల్చి చంపాడు. డిసెంబర్ చివర్లో హిందూ కుటుంబాల ఇండ్లు, షాపులు లక్ష్యంగా దాడులు చేసి నిప్పంటించారు. 

ఎన్నికల వేళ ఉద్రిక్తతలు..  

బంగ్లాదేశ్‌‌ లో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో హిందువులపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి హిందువుల ఇండ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కాగా, విద్యార్థి సంఘం నాయకుడు షరీఫ్‌‌ ఉస్మాన్‌‌ బిన్‌‌ హాదీ హత్యతో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ దాడులను ప్రపంచ దేశాలతో పాటు ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నది. మైనారిటీల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌‌లోని పలు నగరాల్లో హిందువులు భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.