హర్యానాలో టెన్షన్.. టెన్షన్.. కొనసాగుతున్న కర్ఫ్యూ

హర్యానాలో టెన్షన్.. టెన్షన్.. కొనసాగుతున్న కర్ఫ్యూ
  • హర్యానాలో టెన్షన్.. టెన్షన్
  • సమస్యాత్మక ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
  • సాయంత్రం 2 గంటల పాటు రిలీఫ్
  • పరిస్థితిని సమీక్షించాకే కర్ఫ్యూ ఎత్తేస్తామన్న అధికారులు
  • అల్లర్లకు వదంతులే కారణమని తేల్చిన పోలీసులు
  • సాయంత్రం 2 గంటల పాటు రిలీఫ్
  • పరిస్థితి సమీక్షించాకే కర్ఫ్యూ ఎత్తేస్తామన్న అధికారులు
  • అల్లర్లకు వదంతులే కారణమని తేల్చిన పోలీసులు

చండీగఢ్ :  హర్యానాలో ఇంకా టెన్షన్ వాతావరణమే ఉంది. నూహ్ జిల్లాతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్​నెట్ సేవలను నిలిపేసింది. సెన్సిటివ్ ఏరియాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించింది. పరిస్థితి కొంత అదుపులోనే ఉన్నా.. ఎలాంటి ఘర్షణలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్పీసీ 144 సెక్షన్ అమలు చేస్తున్నది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. కర్ఫ్యూ విధించిన ఏరియాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల దాకా రిలీఫ్ ఇచ్చింది. తర్వాత కర్ఫ్యూని కొనసాగించింది. పరిస్థితి సమీక్షించి కర్ఫ్యూ ఎత్తేయడంపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. కర్ఫ్యూ కొనసాగుతున్న ఏరియాల్లో స్కూల్స్, కాలేజీల రీ ఓపెన్​పై కూడా స్పష్టత ఇస్తామని తెలిపారు. మొత్తం 20 కంపెనీల పారా మిలటరీ బలగాల్లో 14 కంపెనీలను నూహ్​లోనే మోహరించారు. 28 కంపెనీల హర్యానా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఎవరీ మోను మనేసర్?

‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ పేరుతో వీహెచ్​పీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది. సోమవారం ఈ యాత్ర గురుగ్రామ్​లోని సివిల్​లైన్ నుంచి ప్రారంభమైంది. నూహ్ జిల్లా ఖెడ్లా మోడ్ ఏరియాకు రాగానే ఓ వర్గం వారు యాత్రను అడ్డుకున్నారు. దీంతో హింస చెలరేగింది. దీనికి కారణం పుకార్లే అని స్పష్టమవుతున్నది. ఈ అల్లర్లలో 28 ఏండ్ల మోహిత్ యాదవ్ అలియాస్ మోను మనేసర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. ఇతను గో సంరక్షకుడిగా అందరికీ పరిచయం. ఫిబ్రవరి 16న రాజస్థాన్​లోని భివానీలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న జునైద్, నసీర్ ను కిడ్నాప్ చేసి హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 21 మందిపై కేసు రిజిస్టరైంది. వీరిలో మోను ఒకడు. ఐదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మోను.. తాను కూడా యాత్రకు హాజరవుతున్నా అని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని వీడియోలో పిలుపునిచ్చాడు. దీంతో ఓ వర్గం వాళ్లు హెచ్చరిస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. నూహ్​కు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అల్లర్లు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. 

అప్రమత్తమైన యూపీ

హర్యానాలో మొదలైన అల్లర్లు మంగళవారం గురుగ్రామ్​కు పాకడంతో పక్కనే ఉన్న యూపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. షహరన్​పూర్, షామ్లీతో పాటు ముజఫర్​నగర్ జిల్లాల్లో భారీ బలగాలను మోహరించింది. హర్యానా– యూపీ బార్డర్​లో చెకింగ్​ పాయింట్లు ఏర్పాట్లు చేసి.. తనిఖీలు చేస్తున్నది. నూహ్​లో చెలరేగిన అల్లర్ల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 41 ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయి. 116 మందిని అరెస్ట్ చేశారు. 100 మందిని విచారిస్తున్నారు. 

ఎవరైనా ఉపేక్షించేది లేదు: మనోహర్ లాల్ ఖట్టర్

అల్లర్లకు కారణమైన వాళ్లు ఎవరైనా ఉపేక్షించేది లేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి భద్రత కల్పించడం సాధ్యం కాదని అన్నారు. నూహ్ ఘర్షణల తర్వాత ఇతర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వచ్చాయన్నారు. గాయపడిన వారికి నూహ్​లోని నల్హర్, గురుగ్రామ్​లోని హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్ ఇస్తున్నామన్నారు. దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లకు కారణమైన వారి నుంచే నష్ట పరిహారాన్ని వసూలు చేస్తామని సీఎం మనోహర్ లాల్​ ఖట్టర్ స్పష్టం చేశారు.

శాంతిని కాపాడాలి: హోంమంత్రి అనిల్ విజ్

నూహ్​ను 8 సెక్టార్​లుగా డివైడ్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని హర్యానా హోంమంత్రి అనిల్ అన్నారు. బుధవారం ఆయన అంబాలాలో మీడియాతో మాట్లాడారు. ఒక్కో సెక్టార్​కు ఒక ఐపీఎస్​ను నియమించామన్నారు. అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్​లు నమోదు చేస్తున్నామని తెలిపారు. రేవారి, గురుగ్రామ్​లో కూడా కేసులు రిజిస్టర్ చేశామన్నారు. రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. నూహ్ అల్లర్ల వెనుక ప్లానింగ్ ఉందని ఆరోపించారు. ఇందులో భాగంగా కీలక పాయింట్ల వద్ద రాళ్లు, ఆయుధాలు  సిద్ధంగా పెట్టుకున్నారన్నారు.