కరోనా ఎఫెక్ట్.. సైబర్‌‌‌‌ సెక్యూరిటీకి టాప్‌‌‌‌ ప్రయారిటీ

కరోనా ఎఫెక్ట్.. సైబర్‌‌‌‌ సెక్యూరిటీకి టాప్‌‌‌‌ ప్రయారిటీ
  •     రిమోట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌తో  సెక్యూరిటీ సమస్యలు
  •     సైబర్‌‌‌‌ సెక్యూరిటీ కోసం  పెరిగిన ఖర్చు
  •     వెల్లడించిన సిస్కో స్టడీ

బెంగళూరు : కరోనా వల్ల దాదాపు అన్ని కంపెనీలూ ఉద్యోగులకు వర్క్‌‌‌‌ ఫ్రం హోం సదుపాయం కల్పించడంతో కంప్యూటర్లకు సైబర్‌‌‌‌ సెక్యూరిటీపై మరింత ఫోకస్‌‌‌‌ చేయాల్సి వస్తోందని సిస్కో చేసిన స్టడీ వెల్లడించింది. ఈ మేరకు ‘ఫ్యూచర్‌‌‌‌ ఆఫ్ సెక్యూర్‌‌‌‌ రిమోట్‌‌‌‌ వర్క్‌‌‌‌’ పేరుతో రిపోర్టును విడుదల చేసింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది ఐటీ కంపెనీ సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ల అభిప్రాయాలను తీసుకుంది. వీటిలో కొన్ని ఇండియా కంపెనీలు కూడా ఉన్నాయి. సిస్కో రిపోర్టు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా తరువాత తమ కంప్యూటర్లకు సైబర్‌‌‌‌ థ్రెట్స్‌‌‌‌ లేదా అలెర్ట్స్‌‌‌‌ 25 శాతం పెరిగాయని 73 శాతం కంపెనీలు తెలిపాయి. రిమోట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌, వర్క్‌‌‌‌ ఫ్రం హోంకు ఇబ్బందులు లేకుండా చేయడానికి 65 శాతం కంపెనీలు సైబర్‌‌‌‌ సెక్యూరిటీని మరింత పెంచాయి. హఠాత్తుగా ఉద్యోగులకు రిమోట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ఇవ్వడం వల్ల కంప్యూటర్లకు సెక్యూరిటీ ఇవ్వడం సమస్యగా మారింది. ఉద్యోగి ఐడెంటినీ వెరిఫై చేయడం కష్టతరంగా మారింది. డేటా భద్రతపై ఆందోళనగా ఉందని 66 శాతం కంపెనీలు, మాల్వేర్‌‌‌‌ గురించి భయంగా ఉందని 62 శాతం కంపెనీలు తెలియజేశాయి. ‘‘రిమోట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ను మొదలుపెట్టిన తరువాత చాలా కంపెనీలు సైబర్‌‌‌‌ సెక్యూరిటీని మరింత పటిష్టం చేశాయి. క్లౌడ్‌‌‌‌ సెక్యూరిటీ కోసం బాగా ఖర్చు చేశాయి. క్లౌడ్‌‌‌‌ సెక్యూరిటీ తమకు అత్యంత ముఖ్యమని 31 శాతం కంపెనీలు వెల్లడించాయి’’ అని సిస్కో ఇండియా, సార్క్‌‌‌‌ సెక్యూరిటీ బిజినెస్ డైరెక్టర్‌‌‌‌ విశాఖ్‌‌‌‌ రమణ్‌‌‌‌ వివరించారు. ఇంటి నుంచి పనిచేసే వాళ్లు సొంత వై–ఫై లేదా హాట్‌‌‌‌స్పాట్లు వాడుతారు కాబట్టి డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మరికొందరు సొంత ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, డెస్క్‌‌‌‌టాప్‌‌‌‌లు, పర్సనల్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు వాడుతారు వాటికి సైబర్‌‌‌‌ సెక్యూరిటీ కీలకంగా మారింది. మరో విషయం ఏమిటంటే కొన్ని కంపెనీలు ఇటీవల హైబ్రిడ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులు ఇంటి నుంచి కొన్ని రోజులు, ఆఫీసుకు వచ్చి కొన్ని రోజులు పనిచేయవచ్చు.

మరింత పెరగనున్న రిమోట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌…

ఇండియా కంపెనీల్లో సగం కంపెనీలు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని చెప్పాయి. మొత్తం ఉద్యోగుల్లో సగం మందికి రిమోట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌ ఇస్తామని 53 శాతం కంపెనీలు ప్రకటించాయి. కరోనాకు ముందు కేవలం 28 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేవారు. ఏరకంగా చూసినా సైబర్‌‌‌‌ సెక్యూరిటీ ఇప్పుడు తమకు టాప్‌‌‌‌ ప్రయారిటీ మారిందని 84 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి. ఇందుకోసం మరింత ఖర్చు చేస్తామని 77 శాతం కంపెనీలు తెలియజేశాయి.