పరిశ్రమలు పెడతామని ఒప్పందం చేసుకుని.. పత్తా లేకుండా పోతున్నసంస్థలు

పరిశ్రమలు పెడతామని ఒప్పందం చేసుకుని.. పత్తా లేకుండా పోతున్నసంస్థలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్న 2,629 సంస్థలు పత్తాలేవు. ఏడేళ్లలో చిన్నతరహా పరిశ్రమలు తప్పా పెద్ద పరిశ్రమలేవీ రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించలేదు. మొత్తంగా రూ.2,29,280 కోట్లతో 19,138 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు కోసం  అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాయి. కానీ అందులో రూ.1,20,869 కోట్ల పెట్టుబడితో 14,579 పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఇంకా మొదలు కావాల్సిన పరిశ్రమలు 4,559 మాత్రమే అనిపిస్తున్నా వాటి ద్వారా రావాల్సిన పెట్టుబడులు మాత్రం రూ.1,08,411 కోట్లు. వచ్చిన వాటిలో 970 పరిశ్రమలు పునాదుల దశలో ఉండగా, నిర్మాణ దశలో ఇంకో 960 వరకు ఉన్నాయి. టీఎస్‌‌‌‌ ఐపాస్‌‌‌‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడేండ్లలో 16 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ 9.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయని ఇండస్ట్రీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెక్కలు చెబుతున్నాయి. 
మేడ్చల్‌‌‌‌లో హయ్యెస్ట్‌‌‌‌ ఇండస్ట్రీస్
టీఎస్‌‌‌‌ బీపాస్‌‌‌‌ వచ్చిన తర్వాత మేడ్చల్‌‌‌‌లో అత్యధికంగా 4,139  పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.  సంగారెడ్డి జిల్లా1,526 ఇండస్ట్రీస్‌‌‌‌తో రెండో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా హైదరాబాద్‌‌‌‌ జిల్లాలో 52 ఇండస్ట్రీస్‌‌‌‌ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నారు. పెట్టుబడుల్లో రూ.71 వేల కోట్లతో రంగారెడ్డి టాప్‌‌‌‌లో నిలిచింది. ఇక్కడ 1,384 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ములుగు జిల్లాలో రూ.41.76 కోట్లతో 60 పరిశ్రమల ఏర్పాటుకు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారు. కరీంనగర్‌‌‌‌లో 1,339, జగిత్యాలలో 951, ఖమ్మంలో 771, హనుమకొండలో 730, నిజామాబాద్‌‌‌‌లో 633, సిరిసిల్లలో 603, యాదాద్రిలో 576, నల్గొండలో 539, మెదక్‌‌‌‌లో 482, వరంగల్‌‌‌‌లో 455, వికారాబాద్‌‌‌‌లో 441 సంస్థలు అగ్రిమెంట్​ చేసుకున్నాయి. సిద్దిపేటలో 400, మహబూబాబాద్‌‌‌‌లో 389, మంచిర్యాలలో 384, భద్రాద్రి కొత్తగూడెంలో 374, కామారెడ్డిలో 367, జనగామలో 352, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 321, సూర్యాపేటలో 254, ఆదిలాబాద్‌‌‌‌లో 252, నిర్మల్‌‌‌‌లో 200, ఆసిఫాబాద్‌‌‌‌లో 179, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో 170, భూపాలపల్లిలో 131, గద్వాలలో 95, వనపర్తిలో 84, నారాయణపేటలో 53 పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని పరిశ్రమల శాఖ లెక్కలు చెబుతున్నాయి.
కాగితాలమీదే ఉద్యోగాలు
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్లదే అగ్రస్థానం. రూ.61 వేల కోట్లతో16 ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నాయి. వీటి ద్వారా 12 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. రూ.57 వేల కోట్లతో 174 రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌, ఇండస్ట్రియల్‌‌‌‌ పార్క్స్‌‌‌‌, ఐటీ పార్క్‌‌‌‌ల నిర్మాణానికి అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారు. వీటి ద్వారానే 90 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు. సోలార్‌‌‌‌ - రెన్యూవబుల్‌‌‌‌ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో రూ.20 వేల కోట్లతో 225 పరిశ్రమలు స్థాపించేందుకు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారు. ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కెమికల్స్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో రూ.22 వేల కోట్లతో 1,249 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 1.13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో రూ.4,147 కోట్లతో 624 పరిశ్రమల ఏర్పాటుకు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారు. వీటి ద్వారా 2.04 లక్షల మందికి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు.