సబ్బుల రేట్లు తగ్గించిన కంపెనీలు

సబ్బుల రేట్లు తగ్గించిన కంపెనీలు

న్యూఢిల్లీ: ఎఫ్​ఎంసీజీ కంపెనీలు హిందుస్థాన్​ యూనిలీవర్​, గోద్రెజ్​ కన్జూమర్​ ప్రొడక్ట్స్​లు తమ బ్రాండ్స్​ సబ్బుల రేట్లను 15 శాతం దాకా తగ్గించాయి. ప్రధాన ముడిసరుకు పామాయిల్​తో పాటు, ఇతర ముడిసరుకుల రేట్లు కిందకి దిగి వస్తుండటమే దీనికి కారణం. లైఫ్​బాయ్​, లక్స్​ సబ్బుల రేట్లను పశ్చిమ ప్రాంతంలో 5 నుంచి 11 శాతం దాకా హిందుస్థాన్​ యూనిలీవర్​ తగ్గించింది. మరోవైపు గోద్రెజ్​ గ్రూప్ కంపెనీ జీసీపీఎల్​ కూడా తన నెం. 1 బ్రాండ్​ సబ్బు రేటుపై 13 నుంచి 15 శాతం  దాకా తగ్గింపు ప్రకటించింది. సబ్బుల రేట్లను కంపెనీలు తగ్గించడంతో ఇప్పటి నుంచి మార్చి దాకా వాల్యూమ్స్​ భారీగా పెరిగే ఛాన్స్​ ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

ఇన్​ఫ్లేషన్​ కారణంగా ఓవరాల్​ డిమాండ్​ మన దేశంలో నెమ్మదిగానే ఉన్న విషయం తెలిసిందే. గ్లోబల్​గా పామాయిల్​ రేట్లు కిందకి దిగడంతోపాటు, ఇతర ముడిసరుకుల రేట్లూ తగ్గుముఖం పట్టడం వల్లే సబ్బుల రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. కమోడిటీల రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో సబ్బుల రేట్లు తగ్గించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు జీసీపీఎల్​ సీఎఫ్​ఓ సమీర్​ షా చెప్పారు. అయిదు సబ్బులుండే (ఒక్కోటి 100 గ్రా) నెం. 1 బ్రాండ్​ ప్యాక్​ రేటును రూ. 140 నుంచి తాజాగా రూ. 120 కి తగ్గించినట్లు పేర్కొన్నారు. లైఫ్​బాయ్​, లక్స్​ బ్రాండ్ల రేట్లను పశ్చిమ భారత దేశంలో తగ్గించామని హెచ్​యూఎల్​ ప్రతినిధి చెప్పారు. ఇతర ప్రాంతాలలోనూ రేట్లను తగ్గించనున్నారా లేదా అనేది ఆయన స్పష్టం చేయలేదు. అలాగే పశ్చిమ ప్రాంతంలో ఎంత తగ్గించారో కూడా వెల్లడించలేదు. అయితే, అందుబాటులోని సమాచారం ప్రకారం చూస్తే ఈ కంపెనీ పై బ్రాండ్ల రేట్లను 5 నుంచి 11 శాతం దాకా తగ్గించినట్లు అర్ధమవుతోంది. సర్ఫ్​, రిన్​, వీల్​, డోవ్​ వంటి బ్రాండ్ల రేట్లను తగ్గించినట్లు వస్తున్న వార్తలను ఆ ప్రతినిధి ఖండించారు. రా మెటీరియల్స్​ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్​ వాటా కాపాడుకోవడానికి ఈ రేట్ల తగ్గింపు నిర్ణయం సాయం చేస్తుందని ఎడిల్వీస్‌ ​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ఈవీపీ అబ్నీష్​ రాయ్​ పేర్కొన్నారు.