నిజామాబాద్లో ఈ ఏడాది నేరాలు ఎక్కువే..47 మర్డర్లు, 96 కిడ్నాప్​లు

నిజామాబాద్లో ఈ ఏడాది నేరాలు ఎక్కువే..47 మర్డర్లు, 96 కిడ్నాప్​లు
  • మిస్సింగ్​ కేసుల్లో జాడలేని 149 మంది
  • వివిధ చోట్ల దొంగలెత్తుకెళ్లిన సొత్తు రూ.6 కోట్లకు పైనే
  • రికవరీ రూ.1.26 కోట్లు మాత్రమే
  • జిల్లా వార్షిక క్రైమ్ ​రిపోర్ట్​లో పోలీసుల వెల్లడి

నిజామాబాద్, వెలుగు: గతంతో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది మర్డర్, మిస్సింగ్, కిడ్నాప్​ కేసులు పెరిగాయి. మహిళలపై అఘాయిత్యాలు కూడా ఎక్కువయ్యాయి.  ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్​ రిపోర్ట్​లో ఈ వివరాలు ఉన్నాయి.​ జనవరి నుంచి ఇప్పటి దాకా 47 మంది హత్యలకు గురికాగా, దాడుల్లో 69 మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. 96 మంది కిడ్నాప్​కు గురికాగా, 72 రేప్​ కేసులు నమోదయ్యాయి.741 మంది మిస్సింగ్​ కేసుల్లో 149 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. ఆయా కారణాలతో 345 మంది సూసైడ్ ​చేసుకున్నారు. 

1,212 దొంగతనాలు

జిల్లాలో ఈ ఏడాది 1,212 దొంగతనం కేసులు జరగాయి.  వీటిలో దోపిడీ కేసులు 24 ఉండగా, 436 వెహికల్స్​ దొంగలెత్తుకెళ్లారు. 40 చైన్​ స్నాచింగ్ ​ఘటనలు జరిగాయి. దొంగతనాలతో రూ.6.02 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లగా, పోలీసులు రూ.1.26 కోట్ల సొత్తునే రికవరీ చేశారు. నగదు పోయిన కేసుల్లో సొమ్ము రికవరీ కాలేదు. నమోదు చేసిన 1,212 కేసుల్లో ఇప్పటికి 371 కేసుల దర్యాప్తు ముగిసింది. ఇంకా 841 కేసులు కొలిక్కిరాలేదు. బాధితులు పోగొట్టుకున్న సొత్తు రికవరీ పోలీసులకు పెద్దగా సవాలుగా మారింది.

పెరిగిన డౌరీ కేసులు

ఈ ఏడాది జిల్లాలో 347 మంది మహిళలు వరకట్న వేధింపులు ఎదుర్కొన్నారు. వేధింపుల కారణంగానే నలుగురు చనిపోయారు. 175 మంది సెక్సువల్​హెరాస్​మెంట్​ ఎదుర్కొన్నారు. బాధితుల్లో బాలికలు కూడా ఉన్నారు. రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్​ల  నిఘా కొనసాగుతున్నా 42 మంది యువతులు ఈవ్​టీజింగ్​ బాధితులయ్యారు.

745 రోడ్ ​యాక్సిడెంట్లు 

జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన 745 రోడ్ యాక్సిడెంట్లలో 309 మంది ప్రాణాలు కోల్పోయారు. 749 మందికి గాయాలయ్యాయి. 708 వైట్​కాలర్​కేసులు రిజిస్ట్రర్ ​అయ్యాయి. ఆన్​లైన్​ మోసాలు, సైబర్​క్రైమ్, కొనుగోలు మోసాలు ఇందులో అధికంగా ఉన్నాయి. 97 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఆయా  కేసుల్లో 122 మందికి కోర్టు జైలు శిక్ష పడింది.

డయల్​ 100కు 63,984 కాల్స్

డయల్​100కు ప్రజల ఆదరణ పెరుగుతోంది.పోలీసుల సహాయాన్ని కోరుతూ మొత్తం 63,984 కాల్స్​చేశారు. దాడులు, దొంగతనాలు తదితర అంశాలపై పోలీసుల హెల్ప్​ కోరారు. 

భారీగా జరిమానాలు

డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన 8,706 మంది నుంచి రూ.77.89 లక్షల జరిమానాలు వసూలు చేశారు. ట్రాఫిక్​ ఉల్లంఘనలపై రూ.13.16 కోట్ల ఈ–చలాన్​ జరిమానాలు వేశారు. పత్తాలాటలో రూ.61.25 లక్షలు, మట్కాలో రూ.84,207 పట్టుకున్నారు. రూ.7.47 లక్షల విలువైన గంజాయి దొరకగా, రూ.69.58 లక్షల పీడీఎస్​బియ్యాన్ని పట్టుకున్నారు. గుట్కా కేసులు లేకపోవడం ఉపశమనం కలిగించే విషయం. ముగ్గురు యువకులపై పీడీ యాక్ట్​ నమోదు చేశారు.