
- 18 ఏండ్ల తర్వత ప్రజాదర్బార్‌తో కారుణ్య నియామకం
- కొత్తగూడెం జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్‌గా రామకృష్ణకు ఉద్యోగం
హైదరాబాద్, వెలుగు: కారుణ్య నియామకం కోసం ఓ దివ్యాంగుడు 18 ఏండ్లు చేసిన పోరాటం ఫలించింది. కర్నాటి నాగేశ్వరరావు కొత్తగూడెం పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తూ 2007లో అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి భార్య కర్నాటి రాణి, దివ్యాంగుడైన కొడుకు రామకృష్ణ, మరో కొడుకు కోటేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు మృతితో అప్పటికే 21 ఏండ్లున్న పెద్ద కొడుకు కర్నాటి రామకృష్ణ కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, పలు కార ణాలతో సమస్య పరిష్కారం కాలేదు.
దాంతో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా 2013 అక్టోబర్ లో రామకృష్ణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. చిన్న కొడుకు కోటేశ్వరరావుకు వివాహమై, ఆటో నడుపుతూ కుటుంబంతో విడిగా ఉంటున్నాడు. రామకృష్ణ మాత్రం తల్లితో ఉంటున్నాడు. 2023లో ప్రజా భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్‌కు వెళ్లి కారుణ్య నియామకం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చారు. ఇటీవల కర్నాటి రామకృష్ణ వినతిపత్రాన్ని సీఎంవో అధికారులు పరిశీలించి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తెచ్చారు.
మంత్రి ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలో కర్నాటి రామకృష్ణను ఆఫీసు సబార్డినెట్ గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. అశ్వారావుపేట సబ్ డివిజన్ ముల్కలపల్లి మండలంలో పోస్టింగ్ వచ్చింది. ప్రజా దర్బార్ ద్వారా న్యాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కర్నాటి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.