AP: స్కూళ్ల కోసం పంపిన కంప్యూటర్లు మాయం

AP: స్కూళ్ల కోసం పంపిన కంప్యూటర్లు మాయం


స్కూల్ కాంప్లెక్స్ నిధులు.. ఎమ్మార్సీ నిధులు కూడా బొక్కేశారు

సర్కారీ స్కూళ్లకు పంపాల్సిన కంప్యూటర్లను అధికారులు పప్పులు బెల్లాల్లా పంచుకున్నారు

ప్రశ్నిస్తే ఆమాత్యుల బెదిరింపులు.. మౌనవ్రతం పడుతున్న విద్యాధికారులు
సమాచార చట్టం కింద సేకరించిన సాక్షాధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు 
తూతూ మంత్రంగా విచారణ చేసి.. నామమాత్రంగా రికవరీలు
కోట్ల రూపాయలు బొక్కేసినా ఒక్కరిపైనా చర్యలు తీసుకోని విద్యాశాఖ

ప్రహారి గోడలు కట్టి.. రంగులేసి ప్రభుత్వాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న అవినీతి బకాసురులు

నాడు..నేడు కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే అపహాస్యం పాలు చేస్తున్న వైనం

సాక్షాధారాలతో లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన బహుజన టీచర్స్ 

హైదరాబాద్/విజయవాడ: సర్కార్ స్కూళ్లను ఉధ్దరించడం కోసం ప్రభుత్వం గట్టి పట్టుదలతో ‘’నాడు..నేడు’’ పేరుతో అన్ని స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే.. కొందరు అవినీతి అధికారులు.. విద్యాశాఖ సిబ్బంది లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా ప్రయత్నిస్తున్నారు. తమ భాగస్వామ్యం ఎక్కడ బయటకొస్తుందోనని భయపడుతున్నారేమో..  స్కూళ్లకు ప్రహారి గోడలు కట్టి.. రంగులేస్తే చాలు.. ఇదే అభివృద్ధి .. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. సర్కారీ స్కూళ్ల నిర్వహణకు ఇచ్చే నిధులన్నీ యధేచ్చగా సొంతానికే వాడేసుకుంటున్నారు.  స్కూళ్లలో చదువుకునే పోరగాళ్ల కోసం కంప్యూటర్లు... కాకరకాయ.. వగైరా పంపినా..  సగానికిపైగా అధికారులే తమ ఇళ్లకు తీసుకెళ్లడమే కాదు.. ప్రశ్నించిన సిబ్బందిపై నిర్భీతిగా తెగబడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. విచారణాధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో అవినీతి తీగ.. పై వరకు విష వలయంలా చుట్టుకుని ఎగబాకి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. 
ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఏపీలోని విద్యాశాఖలో యధేచ్చగా సాగుతున్న ఈ అవినీతి అక్రమాల తంతుపై కొందరు పట్టువదలని విక్రమార్కుల్లా సాక్షాధారాలతో వెలికి తీశారు. సదరు ఆధారాతో ఫిర్యాదు చేస్తే.. అవినీతి నిజమేనంటూ విచారణ జరిపి.. బండెడు బొక్కేస్తే.. ఎలుక తోకంత రికవరీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాదు అవినీతిపరులు అమాయకులుగా పరిగణిస్తూ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసిన ఘటనల పాపాల పుట్ట పగిలింది. ఎందుకంటే సహ చట్టం కింద అక్రమాలు వెలికితీసిన వారు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. ఎంత మేర రికవరీ చేశారో చూపించమంటూ తిరిగి అదే సహచట్టం కింద ప్రశ్నించినా.. అవినీతి విద్యాధికారుల వైఖరిలో మార్పు రాలేదు. ఇలాంటివి బోలెడు చూశామన్నట్లు ఫైళ్లను అటకెక్కించడంతో.. దాదాపు దశాబ్దకాలంగా సాగుతున్న వ్యవహారాలన్నీ కళ్లకు కట్టినట్లు ఆధారాలతో కట్టకట్టి నేరుగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. 
ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న వైనం
జిల్లా స్థాయి మొదలు.. రాష్ట్రంలో అత్యున్నత విద్యాశాఖ అధికారుల వరకు ఫిర్యాదు చేసినా.. ఏ మాత్రం మార్పు రాలేదు. కోట్ల రూపాయలు దారిమళ్లించినా.. కేవలం నాలుగైదు లక్షలకు మించి రికవరీ చేయలేదు. దాదాపు 30 నుంచి 40 మంది అక్రమాలు చేసినట్లు ఆధారాలు సమర్పించినా పట్టుమని ఒక్కరి మీద కూడా ఈగవాలనివ్వలేదు. ప్రభుత్వాలు మారినా.. విద్యాశాఖ అధికారులు అవినీతిపరులు, అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్న ఉదంతాలెన్నో బహుజన టీచర్స్ సాక్షాధారాలను..  సహ చట్టం కింద అధికారులే అంగీకరించిన పత్రాలను లోకాయుక్త ముందు పెట్టారు. 
ముఖ్యమంత్రి ఆశయాన్ని దెబ్బతీస్తున్నా.. స్పందించని దిగ్భ్రాంతికర వాస్తవాలను లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. 
ముఖ్యమంత్రి ఒకవైపు నా మాటే శాసనం అంటుంటే.. విద్యాశాఖ అధికారులు మాత్రం.. బాహుబలిలో భళ్లాల దేవలా.. ప్రభుత్వాన్ని.. మభ్యపెడుతూ..  క్షేత్ర స్థాయిలో సర్కారీ విద్యా వ్యవస్థను కట్టప్పలా.. వెన్నుపోటు పొడిచేస్తున్నట్లు పలు ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. కూర్చున్న కొమ్మను నరికేస్తున్న విద్యాశాఖలోని అవినీతి పరుల చిట్టా తవ్వేకొద్ది పుట్టలుపుట్టలుగా బయటపడుతున్నాయి. లోకాయుక్త విచారణ మొదలైతే వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే పరిస్థితి ఏర్పడితేనైనా మార్పు వస్తుందని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కె.సతీష్ కుమార్, రవికుమార్, జయపాల్, జగదీష్ బాబు, శ్రీధర్, రమేష్, చెన్నయ్య, సంజీవ్, ఓబయ్య, జయరాజ్, ప్రసాద్, రాజశేఖర్, మౌలిబాష, మొహమ్మద్ రఫిక్, మహబూబ్ ఖాన్, దస్తగిరమ్మ, మంజులవాణి, నాగసుందరి, నిర్మల, హిల్డా సిసిల్యా తదితరులు ఆశాభావం వ్యక్తం చేశారు. 
లోకాయుక్త విచారణ మొదలైతే.. విద్యాశాఖలో వణుకు
అవినీతి సర్వంతర్యామి.. ప్రభుత్వం దృష్టికి వెళ్తే అంతగా భయపడాల్సిందేముంటుందని తేలిగ్గా తీసుకునే వారికి కొదవలేదు. అయితే ఏపీలో విద్యాశాఖ మాత్రం సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను.. ఆయన వాగ్దానాలను తుంగలోతొక్కేవిధంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఒక ఎత్తైతే.. మళ్లీ అదే తరహా అవినీతి అక్రమాలను రెట్టించిన స్థాయిలో కొనసాగిస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. ఏపీలో ప్రభుత్వాలు మారినా విద్యాశాఖ తీరు ఏమాత్రం మారలేదని లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుకు జత చేసిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. నిరుపేద విద్యార్థులు చదువుకునే స్కూళ్లను కార్పొరేట్ కు దీటుగా.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువే చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పదే పదే చెబుతుంటే.. విద్యాశాఖ అవినీతి అధికారుల ఆగడాలు అంతకంతకు పెరిగాయి. 
గత పదేళ్లుగా  జరిగిన అవినీతి బాగోతాలన్నీ సహ చట్టం ద్వారా వెలికితీసిన వాటిలో కొన్ని..

2011 మరియు 12 మరియు 2012 మరియు 13 విద్యాసంవత్సరాల్లో మంజూరైన స్కూల్ కాంప్లెక్స్ నిధులు బోగస్ బిల్లులు సమర్పించి నిధులు స్వాహా చేశారు కొందరు కర్నూలు జిల్లా హెడ్ మాస్టర్లు. వీటిపై సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదు.
 
511 స్కూల్స్ కు 27,000 చొప్పున దాదాపుగా కోటి, నలభై లక్షలు మంజూరు చేసిన వాటిలో మొత్తం అవినీతి జరిగిందని  2013 లోనే ఆధారాలతో  పిర్యాదు చేస్తే  కేవలం 33 స్కూళ్లలో విచారణ చేసి  4,10,000 రికవరీ చేశారు.
33 మంది హైస్కూల్ HM లకు తీవ్ర మందలింపు (CENSURE) పనిష్మెంట్ తో సరిపెట్టారు. 
వందల స్కూళ్లలో అవినీతి జరిగితే.. తమకు సరిపడని.. కిట్టని ప్రాంతాల్లోని 33 స్కూళ్లలోనే విచారణ చేసి.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు పిడికెడంత రికవరీ చేసిన వైనం అవినీతిపరుల కొమ్ము కాస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. 
గత 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు మారినా  475 స్కూళ్లలో విచారణ ఇప్పటికీ చేయకుండా పెండింగ్ పెట్టారు. 

అలాగే  కర్నూలు జిల్లాలో 2011 మరియు 12 అలాగే  2012 మరియు 13 విద్యాసంవత్సరాల్లో మండల వనరుల కేంద్రం (MRC) లకు సంవత్సరానికి లక్ష చొప్పున నిధులు విడుదల చేస్తే.. MEO లే బోగస్ బిల్లులు సమర్పించి స్వాహా చేశారు. 
ఈ జిల్లాలోని 54 మండలాలు x రెండు సంవత్సరాలకు 2 లక్షలు చొప్పున కోటి, ఎనిమిది లక్షలు మంజూరులో అవకతవకలపై  2016 లోనే ఆధారాలతో  ఫిర్యాదు చేస్తే.. కొన్ని మండలాల్లో రహస్య విచారణ చేసి.. 5 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయి విచారణ చేయని అధికారుల గురించి మళ్లీ ఫిర్యాదు చేస్తే  దోషులుగా తేలిన ఎంఇఓ లపై 2017 లో చర్యలు తీసుకోవాలని SPD ఆదేశాలిచ్చారు. 

స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలిచ్చి  నాలుగేళ్లు గడుస్తున్నా కడప ఆర్జేడీ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. 

కర్నూలు జిల్లా లో 2019 లో భవిత, నాన్ భవిత, అర్బన్ రెసిడెన్సియల్ హాస్టల్ (URH) లకు 131 కంప్యూటర్లు మంజూరు చేస్తే.. ఇష్టారాజ్యంగా ఎవరికి వారు కంప్యూటర్లు పంచేసుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. వీటిపై ఆధారాలతో  పిర్యాదు చేస్తే సర్వోన్నత అధికారుల వరకు పప్పులు బెల్లాల్లా పంచుకున్నట్లు గుర్తించడంతో.. మరోసారి సహచట్టం ద్వారా ప్రశ్నించినా విచారణ పూర్తి కాలేదు. కొన్ని కంప్యూటర్లు కనిపించకపోవడానికి బాధ్యునిగా డీఈఓ కార్యాలయంలోని ఓ చిరుద్యోగి జీతం నుంచి దాదాపు లక్షన్నర రికవరీకి ఆదేశాలు జారీ చేయడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. 

ఇలా స్కూల్ కాంప్లెక్స్ నిధులు.. ఎమ్మార్సీ నిధులే కాదు.. స్కూళ్లకు పంపిన కంప్యూటర్లను సైతం ఇళ్లకు తీసుకెళ్లి చిరుద్యోగులను బలిపశువులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 

గత పదేళ్లుగా ఎన్నో అవినీతి ఉదంతాలను సహ చట్టం ద్వారా వెలికితీసి ప్రశ్నిస్తూ ఉన్నతాధికారులకు సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. ఏళ్ల తరబడి విచారణ జరపకుండా కాలయాపన చేస్తూ.. ఆపై విచారణ నివేదిక కోసం జాప్యం చేస్తూ.. నివేదికలను బట్టి చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులను ఆదేశించినా.. వాటిని కూడా ఏళ్ల తరబడి అమలు చేయకుండా కాలయాపన చేస్తుండడం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుచున్న అధికారులలో ఎలాంటి చలనం లేకపోవడం చాలా భాధాకరం అని బహుజన టీచర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం మంజూరు చేస్తున్న నిధులు స్వాహా చేస్తుంటే.. చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులే తప్పులు చేస్తున్న ఉద్యోగుల పక్షాన నిలబడి ఫిర్యాదులను క్యాష్ చేసుకుంటూ తప్పుడు మరియు బోగస్ నివేదికలు సమర్పించుకుంటూ కాలయాపన చేస్తున్నారని వారు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. కొందరు ఉద్యోగులు రిటైర్మెంట్ కు చేరువవుతున్నారని.. వారు రిటైర్ అయ్యేవరకు విచారణ జరగకుండా.. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. చర్యలు తీసుకోకుండా ఘటనలకు భాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం కోసం ఆదేశాలు జారి చేయాలని తదితరులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా.. సదరు ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించి కేసు రిజిస్టర్ చేసి నెంబర్ జారీ చేసింది.