
నస్పూర్/ ఆదిలాబాద్ టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్లు పాల్గొని అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా ప్రజల నుంచి మొత్తం 112 దరఖాస్తులు వచ్చినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, రహదారులు, విద్య, వైద్యం, మున్సిపాలిటీ, డీడబ్ల్యూవో, రెవెన్యు తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
కల్లుగీత సొసైటీ కన్వీనర్‌పై ఫిర్యాదు
మంచిర్యాల కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ అర్జీలు స్వీకరించారు. భూమిని కబ్జా కాకుండా కాపాడాలని, భూ సమస్యలు పరిష్కరించాలని, బెల్లంపల్లి సమీకృత కూరగాయల మార్కెట్ షాపు లీజు అగ్రిమెంట్ చేయాలని, దౌర్జన్యంగా తమ భూమిలోకి చొరబడి దున్నారని న్యాయం చేయాలని కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు.
అనుమతులు లేకుండానే క్లాసులు నిర్వహిస్తూ, సేఫ్టీ పాటించకుండా విద్యార్థిని మృతికి కారణమైన మంచిర్యాలలో మిమ్స్కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవనాన్ని సీజ్ చేయాలని ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ కోరారు. మంచిర్యాల కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం కన్వీనర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని అదే సొసైటీకి చెందిన సభ్యుడు కోల రాజగౌడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించకుండా కొత్తగా సభ్యులను చేర్చుకొని ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడని ఆరోపించాడు. సంఘ సభ్యులకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా చేసి పెత్తనం చెలాయిస్తున్నా డని ఆరోపిస్తూ.. విచారణ చేపట్టి సంఘ సభ్యులకు న్యాయం చేయాలని కోరాడు.
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్‌ధోత్రే దరఖాస్తులు స్వీకరించారు. వృద్ధాప్య ఫించన్ మంజూరు చేయాలని, తమ భూమిలో సాగు చేసిన పత్తి పంటను వేరే వ్యక్తి ధ్వంసం చేసినందుకు చర్యలు తీసుకోవాలని, అడ ప్రాజెక్టు నిర్మాణంలో తన భూమి పోయిందని, నష్టపరిహారం ఇప్పించాలని, భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.