రెండో రోజూ అధిష్టానానికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు

రెండో రోజూ అధిష్టానానికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి రాష్ట్ర నేతల ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. త్వరలో స్టేట్​ కమిటీ విస్తరణ జరగనున్న నేపథ్యంలో అధిష్టానంతో ముఖ్య లీడర్లు వరుస మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్న స్టేట్​ లీడర్లు లాబీయింగ్ లో మునిగిపోయారు. అధిష్టానానికి కంప్లైంట్​లు, అభ్యంతరాలను తెలుపుతూ అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల ప్రకటనలో తమవారి పేర్లు ఉండేలా చూస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం, త్వరలో రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే పాదయాత్ర, పీసీసీ పై ఫిర్యాదులు, పార్టీకి నష్టం కలిగించేలా కొందరు సీనియర్ల  బహిరంగ ప్రకటనలపై ఉత్తమ్, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, పలువురు నేతలు మంగళవారం పార్టీ చీఫ్ ఖర్గేతో విడివిడిగా భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. బుధవారం మరో సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఖర్గే తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ మీటింగ్​లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో డ్రా బ్యాక్స్, సీనియర్ల వ్యవహార శైలి, కొత్త వారికి నూతన కార్యవర్గ విస్తరణలో చోటు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాంరెడ్డి.. తాను మునుగోడు ఇంచార్జ్ గా పని చేశానని, అందుకు సంబంధించిన రిపోర్ట్ ను అందించినట్లు చెప్పారు. పార్టీ బాగా పని చేసినా.. మైక్రో మేనేజ్మెంట్ లో విఫలమైందన్నారు. ఆర్గనైజేషన్ లో ఒక సిస్టం ఉందని, బాడీలో ఎవరు బాగా పని చేస్తారో వారికి మాత్రమే కొత్త టీంలో అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, అధిష్టానం వేసిన మరో ముగ్గురు ఇంచార్జ్ ల నివేదికల ఆధారంగానే పదవులు దక్కవచ్చన్నారు. అయితే, సూర్యాపేట జిల్లాలకు చెందిన పటేల్ రమేశ్ రెడ్డికి కీలక పదవి దక్కవచ్చన్న మీడియా ప్రసారాల నేపథ్యంలో రాంరెడ్డి ఢిల్లీకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

పార్టీ చీఫ్ ఖర్గేను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్య నేతలు ఏఐసీసీలోని పలువురు కీలక నేతలను కూడా కలిసినట్టు తెలిసింది. ఖర్గేను కలిసే ముందు కొందరు ఏఐసీసీ నేతల్ని ప్రసన్నం చేసుకుంటే, మరికొందరు అధ్యక్షుడిని కలిసి తర్వాత ప్రముఖ నేతలతో వరుస మీటింగ్​లు జరిపినట్లు తెలిసింది. ఉత్తమ్, పొన్నం, షబ్బీర్ అలీ ఖర్గే భేటీ అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్తే, భట్టి బుధవారం ఏఐసీసీలో పలువురిని కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీనియర్లతో పాటు కొత్త వారికి అవకాశం కల్పించాలని నేతలు సూచించినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది.

అలాగే, పార్టీని కాపాడుకోవాలంటే సీనియర్లకు అవకాశం ఇవ్వాలని, కొత్తగా చేరిన వాళ్లకు పెద్దపీట వేయకూడదని మరికొందరు సూచించారు. ఈ కోణంలో అసంతృప్తులు, అభ్యంతరాలను హైకమాండ్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం పీసీసీ సూచించిన వారికే కాకుండా, పార్టీ కోసం ఎంతో కాలంగా పని చేస్తున్న వాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అలాగే, పార్టీ పై బహిరంగ ప్రకటనలు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం