ఆనందయ్య మందుపై తొలి దశ ట్రయల్స్ పూర్తి

ఆనందయ్య మందుపై తొలి దశ ట్రయల్స్ పూర్తి

అమరావతి: కృష్ణ‌ప‌ట్నం ఆనందయ్య మందుపై మొదటి దశ ట్రయల్స్ పూర్తయినట్లు సమాచారం. సిసిఆర్ఏఎస్ ఆదేశాల మేరకు  తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యులు.ఆనందయ్య మందు తీసుకున్న సుమారు 570 మందితో మాట్లాడారు. అలాగే తిరుపతికి చెందిన ఆయుర్వేద వైద్యులు  మరో 270 మందితో మాట్లాడి వారి అనుభవాలు రికార్డు చేసుకున్నారు. అలాగే విజయవాడ వైద్యులు కూడా 300 మంది మందు వాడిన వారితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. అందరి వివరాలు ఆన్ లైన్లో సిసిఆర్ఏఎస్ కు అప్ లోడ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 
టీటీడీ కమిటీ సర్వే
ఆనందయ్య మందుపై టీటీడీ కమిటీ డాక్టర్ రేణుదీక్షిత్ ఆద్వర్యంలో సర్వే చేసింది. మొత్తం 570 మందితో స్వయంగా మాట్లాడి వారి వివరాలు, అనుభవాలతో కమిటీ సర్వే చేసింది.  చాలా మంది ఆనందయ్య మందు తమకు బాగా పనిచేసినట్లు సానుకూలంగా స్పందించినట్లు టీటీడీ కమిటీ వైద్యులు చెబుతున్నారు. మొత్తం నివేదికను  సీసీఆర్‌ఏఎస్‌కు టీటీడీ కమిటీ తరపున అధికారికంగా సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆనందయ్య ఉపయోగించిన మందును తిరుపతి సుజన్‌ లైఫ్ ల్యాబ్‌లో రేపట్నుంచి ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. సుజన్‌ లైఫ్ సైన్స్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. సుజన్‌ లైఫ్ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ  కరోనా మందు కాదని నిర్దారిస్తే... ఎక్కువ మంది అభిప్రాయం.. అనుభవాల మేరకు ఇమ్యూనిటీ బూస్టర్ గా పంపిణీచేసే అవకాశం పరిశీలిస్తున్నామన్నారు. ఎక్కువ మంది ఆనందయ్య మందును కోరుకుంటున్నందున ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మందు తయారు చేసి ఎంత మందికైనా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.