షేర్​మార్కెట్​లో పెట్టుబడి పేరిట చీటింగ్ .. వరంగల్, జూబ్లీహిల్స్ పీఎస్​లలో కంప్లయింట్స్​

షేర్​మార్కెట్​లో పెట్టుబడి పేరిట చీటింగ్ .. వరంగల్, జూబ్లీహిల్స్ పీఎస్​లలో కంప్లయింట్స్​
  • అంకుర కార్పొరేషన్ సొల్యూషన్స్​​ బాగోతం 
  • మంచిర్యాల జిల్లా జైపూర్​ లో రూ.4కోట్లు వసూలు 
  • రాష్ర్టవ్యాప్తంగా రూ.50 కోట్లు  

జైపూర్, వెలుగు :  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేటకు చెందిన సురేశ్.. షేర్​మార్కెట్​లో పెట్టుబడుల పేరిట రూ.కోట్లలో మోసం చేశాడు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్​లో ఉంటున్న సురేశ్..​అంకుర కార్పొరేషన్ సొల్యూషన్స్​ సీఈవో, డైరెక్టర్​నని చెప్పుకుంటూ ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని తమ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెడితే 10 నుంచి 20 శాతం వడ్డీ ఇస్తామని ఆశచూపాడు.

జైపూర్ మండలం రామారావుపేట, ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో 28 మందితో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు మొత్తం రూ.4 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించినట్లు తెలిసింది. బాధితులు పెట్టుబడి పెట్టిన నెల రోజుల తర్వాత సురేశ్​కు ఫోన్ చేస్తే స్పందించలేదు. వారం కింద అతడు పరారైనట్టు ఇందారం గ్రామానికి చెందిన ఓ బాధితుడు తెలిపాడు. తమలాంటి వారు రాష్ర్టవ్యాప్తంగా వందల మంది ఉన్నారని చెప్పాడు. కొంతమంది మంచిర్యాల విద్యానగర్ లో అతడు ఉంటున్న ఇంటికి వెళ్లి అడిగితే సురేశ్ ​జాడ తెలియదని, అతడి భార్య మాత్రం ఇక్కడే ఉంటోందని చెప్పారు. దీంతో కొందరు బాధితులు మంచిర్యాల పోలీసులను ఆశ్రయించగా, సురేశ్​కుటుంబసభ్యులను పిలిచి మందలించి పంపించినట్టు తెలిసింది. వారికి కొందరు ఇంటెలిజెన్స్​ పోలీసులు సహకరిస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.  

రాష్ర్టవ్యాప్తంగా రూ.50 కోట్లు 

సురేశ్​తనకు పరిచయం ఉండి హైదరాబాద్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులను, వ్యాపారులను టార్గెట్ చేసి సుమారు రూ.50 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. మంచిర్యాలకు చెందిన ఓ వ్యాపారితో  రూ.1.20 కోట్లు పెట్టుబడి పెట్టించినట్టు సమాచారం. మరికొందరు బాధితులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, వరంగల్ సిటీ పోలీసులకు సురేశ్​పై ఫిర్యాదు చేశారు.