నర్సంపేట, వెలుగు: నర్సింగ్ స్టూడెంట్ తో కాంపౌండర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో బుధవారం రాత్రి కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి నర్సంపేటలో నర్సింగ్ చేస్తోంది. ప్రాక్టీస్ లో భాగంగా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో గత కొన్ని రోజులుగా పని చేస్తోంది.
ఓ పేషెంట్కు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో హాస్పిటల్లో పని చేసే కాంపౌండర్ నర్సింగ్ స్టూడెంట్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించగా, కాంపౌండర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయగా, పేరెంట్స్, బంధువులు బుధవారం సాయంత్రం నర్సంపేటకు చేరుకొని కాంపౌండర్ ను చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
