- వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి.. మరో 400 రోవర్ల కొనుగోలు
- పాలేరు నియోజకవర్గంలో
- త్వరలోనే ‘భూదార్’ పట్టాల పంపిణీ
- రెవెన్యూ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలు, సరిహద్దు తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన సమగ్ర డిజిటల్ భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘భూ సమస్యలు లేని తెలంగాణ’ నిర్మాణమే లక్ష్యంగా ఈ మహత్తర కార్యక్రమం సాగుతోందన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలకు గానూ, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయడంతో పాటు నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కలుపుకుని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే చేపట్టామన్నారు. వచ్చే నెల చివర నాటికి ఈ మొదటి దశను సంపూర్ణంగా పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు.
ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే విజయవంతంగా పూర్తయిందని, సంబంధిత భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఇప్పటికే చట్టబద్ధమైన నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. పనులను వేగవంతం చేసేందుకు ఇప్పటికే వాడుతున్న 411 రోవర్లకు అదనంగా మరో 400 అత్యాధునిక రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారైనట్లు మంత్రి ప్రకటించారు.
ఆధునిక టెక్నాలజీతో..
రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే అమల్లో ఉండటంతో తీవ్ర గందరగోళం నెలకొందని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. కాలక్రమేణా ఆస్తుల విభజనలు, సబ్డివిజన్లు, పట్టణీకరణ విస్తరణ వల్ల హద్దులు చెదిరిపోయాయని.. 1948 నాటికి రాష్ట్రంలో కేవలం 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్ల సంఖ్య నేడు ఏకంగా 2 కోట్ల 29 లక్షలకు చేరిందని వివరించారు.
ఈ భూ సమస్యలను పరిష్కరించేందుకు గొలుసులు, కర్రలు, టేపులు, క్రాస్స్టాఫ్ల వంటి సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. శాటిలైట్ ఆధారితంగా సేకరించిన ప్రతి అంగుళం వివరాలను డిజిటలైజ్ చేసి నేరుగా ‘భూ భారతి’ పోర్టల్లో భద్రపరుస్తున్నామన్నారు. సర్వే పూర్తయిన వెంటనే ఆధార్ తరహాలోనే ప్రతి భూకమతానికి ఒక విశిష్ట గుర్తింపుగా ‘భూదార్ నంబర్’ కేటాయించి, పక్కాగా హద్దులను నిర్ణయిస్తూ ప్రత్యేక ‘భూదార్ కార్డులు’ జారీ చేస్తామన్నారు.
పట్టాదారులందరికీ నోటీసులు ఇచ్చాకే సర్వే
పైలట్ ప్రాజెక్టు కింద తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలోని మొత్తం 665 ఎకరాల్లో నూటికి నూరు శాతం రీసర్వే పూర్తయిందని, త్వరలోనే అక్కడ రైతులకు అధికారికంగా ‘భూదార్ పట్టాల పంపిణీ’ చేపడతామని మంత్రి వెల్లడించారు. సర్వే నిర్వహించేటప్పుడు అధికారులు పక్కా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
ఒక గ్రామానికి వెళ్లే ముందు విధిగా పట్టాదారులందరికీ ముందస్తు నోటీసులు ఇవ్వాలని, సర్వేకు రెండు రోజుల ముందే గ్రామాల్లో తప్పనిసరిగా డప్పు చాటింపు వేయించి రైతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను స్పష్టంగా మార్కింగ్ చేసి, గ్రామకంఠం సరిహద్దులను నిర్ధారించిన తర్వాతే ప్రైవేటు భూముల సర్వే చేయాలని స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన చోట రైతుల నుంచి వచ్చే ప్రతి చిన్న అభ్యంతరాన్ని నిబంధనల ప్రకారం పరిష్కరించి ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు.
