- 2021-22లో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటు
- అప్పుల కిస్తీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నరు
- గ్యారంటీ అప్పులను దాస్తున్నరు
- రాబడిలో సగం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే
- అప్పులు జీఎస్ డీపీలో 27శాతానికి చేరాయని రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రబడ్జెట్ లెక్కాపత్రం సరిగ్గా ఉండటం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. వాస్తవాలు ఒకలా ఉంటే, బడ్జెట్ అంచనాల్లో ఇంకోలా చూపిస్తున్నారని.. బడ్జెట్‌లో పారదర్శకత లోపించిందని ఆందోళన వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలు ఆఫ్- బడ్జెట్ అప్పులను పూర్తిగా వెల్లడించాలని, కానీ వీటిని రాష్ట్ర సర్కార్ బడ్జెట్‌లో దాస్తోందని పేర్కొంది.
బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర ప్రభుత్వం మిగులు లెక్కలు చూపుతోందని.. కానీ చివరకు అది రెవె న్యూ లోటులో ఉంటున్నదని స్పష్టం చేసింది. 2018–19లో రెవెన్యూ మిగులుతో ఉన్న రాష్ట్రం 2021–22 నాటికి రూ. 9,335 కోట్ల రెవె న్యూ లోటులోకి వెళ్లిందని వివరించింది. అదే సమయంలో వస్తున్న రాబడిలో 50 శాతం వరకు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు, వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని తెలిపింది. అప్పులు తీసుకొచ్చి పాత అప్పుల కిస్తీలు, వడ్డీలు కట్టారని స్పష్టం చేసింది.
2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అప్రోప్రియేషన్ అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, మండలిలో ఆదివారం ప్రవేశపెట్టింది. అప్పులు జీఎస్డీపీలో 25 శాతం లోపే ఉండాలని, కానీ రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 27.40 శాతంగా ఉందని నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో పెరుగుతున్న జీఎస్డీపీ శాతానికి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని అభిప్రాయపడింది.
గ్యారంటీ అప్పులు.. ఓవర్ డ్రాఫ్ట్‌లు
అప్పులు జీఎస్డీపీలో 25 శాతం మించకూడదని.. అయితే అవి 27.40 శాతానికి చేరాయని కాగ్ నివేదించింది. 2021–22లో ప్రభుత్వం 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 259 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. 2021–22లో ప్రభుత్వం వంద రోజుల పాటు రూ.22,669 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్ళిందని కాగ్ పేర్కొంది. గత ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్ర అప్పులు రూ. 3,14,662 కోట్లు ఉన్నట్లు చెప్పింది. ఆ మొత్తం జీఎస్డీపీలో అప్పు 27.40 శాతంగా ఉందని వివరించింది.
అప్పుల కింద రూ. 46,994 కోట్లు తీసుకుంటే.. వాటిలో రూ.28,883 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారని.. అప్పులు తీసుకుని ఆ మొత్తాన్ని కూడా అప్పులు, వడ్డీ చెల్లింపుల కోసం వాడుకున్నారని కాగ్ పేర్కొంది. వివిధ ఆర్థిక సంస్థల నుండి అప్పులకు వివిధ ప్రభుత్వ సంస్థలు, డిపార్ట్‌మెంట్‌లకు రూ.40,449 కోట్ల మేర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. ఇలా గత ఏడాది మార్చి నాటికి గ్యారంటీ అప్పులు రూ. 1,35,283 కోట్లు చేసిందని కాగ్ తెలిపింది.
ఈ లెక్కలను బడ్జెట్‌లో చూపించడం లేదని తప్పుపట్టింది. అలాగే 5 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రెండు స్వయంప్రతిపత్తి సంస్థల ద్వారా రూ.20,857 కోట్లు సమీకరించిందని, మార్చి 2022 చివరి నాటికి ప్రభుత్వం తరపున వివిధ బ్యాంకుల నుండి ఆఫ్-బడ్జెట్ రుణాలు రూ.71 వేల కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది. దీని కోసం రాష్ట్ర బడ్జెట్ నుండి అసలు లేదా వడ్డీ చెల్లిస్తారని, కానీ ఈ లెక్కలు కూడా బడ్జెట్‌లో చూపించలేదని కాగ్ పేర్కొంది.
‘రాబడి’ 48,659 కోట్లు తగ్గింది
బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్ పక్కాగా అంచనా వేయడంలో సరైన ఎక్సైజ్ చేయడం లేదని కాగ్ పేర్కొన్నది. 2021–22లో రెవెన్యూ రాబడుల్లో అనుకున్న దాంట్లో రూ.48,659 కోట్లు తగ్గిందని ఈ స్థాయిలో అంచనాలు పడిపోవడం ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేకపోవడమేనని అభిప్రాయపడింది. రూ.1.76 లక్షల కోట్లకు.. రూ.1.27 లక్షల కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. వచ్చిన ఆదాయంలో జీతాలకు రూ.30, 375 కోట్లు, పెన్షన్లకు రూ.14,025 కోట్లు, గతంలో చేసిన అప్పుల వడ్డీలకు రూ.19,161 కోట్లు మొత్తంగా రూ.63,561 కోట్లు వెచ్చించారని పేర్కొంది.
జీఎస్డీపీలో ఫిస్కల్ డెఫిసిట్ 2021–22లో 3 శాతం మించకూడదని, కానీ 4.06 శాతానికి పెరగడం అంటే సరైన ఆర్థిక నిర్వహణ కాదని కాగ్ వెల్లడించింది. 2021-–22లో రాష్ట్ర ప్రభుత్వం 11 గ్రాంట్లకు సంబంధించి రూ.75 వేల కోట్లు అధికంగా ఖర్చు చేసిందని పేర్కొంది. ఫైనాన్స్, ఇరిగేషన్, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ శాఖలకు కేటాయింపులకు మించి 34 శాతం అధికంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారని, హౌసింగ్, ఇండస్ర్టీస్ డిపార్ట్‌మెంట్‌లకు కేటాయించినకంటే తక్కువగా ఖర్చు చేశారని తెలిపింది.

