
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ కాలేజీల్లో టీజీ ఎప్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం సీట్లలో 91.2 శాతం నిండాయి. ఈ మేరకు మంగళవారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఎప్ సెట్ సీట్ల అలాట్మెంట్ డేటాను రిలీజ్ చేశారు. ఎప్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కు రాష్ట్రవ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉండగా.. వాటిలో 91,495 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. అయితే, రెండు విడతల్లో 96,974 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అటెండ్ అయ్యారు. వారిలో సెకండ్ ఫేజ్‌కు ప్రత్యేకంగా 68,630 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
వీరిలో 23,509 మందికి కొత్తగా సీట్లు అలాట్ కాగా.. మరో 21,402 మందికి సీట్లు మారాయి. రెండు విడతల్లో కలిపి మొత్తం 83,521 సీట్లు నిండాయి. కేవలం 7,974 సీట్లు మాత్రమే మిగిలాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టు చేయాలని సూచించారు. కాగా, తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 6,377 మందికి సీట్లు అలాట్ కాలేదు. 77 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. కాగా, 20 సర్కారు వర్సిటీ కాలేజీల్లో 6,198 సీట్లుంటే 4,942 సీట్లు, ఒక గవర్నమెంట్ కాలేజీలో 198 సీట్లుంటే 41 సీట్లు నిండాయి. 155 ప్రైవేటు కాలేజీల్లో 82,713 సీట్లకు 77,158 సీట్లు, రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,380 సీట్లు అలాట్ అయ్యాయి.
కంప్యూటర్ సైన్స్ లోనే 61 వేల సీట్లు నిండినయ్
ఇంజినీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ బ్రాంచ్‌ల సీట్లకే ఫుల్ డిమాండ్ నెలకొన్నది. మొత్తం18 బ్రాంచుల్లో 64,813 సీట్లుంటే 61,845 సీట్లు అలాట్ అయ్యాయి. మరో 2,968 సీట్లు మిగిలాయి. ఆరు బ్రాంచుల్లో వందశాతం సీట్లు నిండాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ దాని అనుబంధ కోర్సుల్లో 17,823 సీట్లు 15,142 (84.96%) సీట్లు అలాట్ అయ్యాయి. సివిల్, మెకానికల్ దాని అనుబంధ కోర్సుల్లో 7,719 సీట్లకు గానూ 5,702 సీట్లు, ఇతర కోర్సుల్లో 1,140 సీట్లుంటే 832 సీట్లు స్టూడెంట్లకు కేటాయించారు.