HP Layoffs: అమెరికాలోని పాలో ఆల్టో కేంద్రంగా పనిచేస్తున్న కంప్యూటర్ దిగ్గజం HP మరోసారి భారీ లేఆఫ్స్ కి సిద్ధమైంది. రానున్న 3 ఏళ్లలో కంపెనీ 6 వేల మంది ఉద్యోగులను తొలగించబోతోందని సీఈఓ ఎన్‌రికే లోరెస్ వెల్లడించారు. ఉత్పత్తి అభివృద్ధి, అంతర్గత కార్యకలాపాలు, కస్టమర్ సపోర్ట్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు. కంపెనీలో ఏఐ వినియోగం పెంచటంతో పాటు కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక అడుగులో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ సేవ్ చేయనున్నట్లు లోరెస్ తెలిపారు.
లేఆఫ్స్ ప్రకటన తరువాత HP షేర్లు ఆఫ్టర్-హవర్స్ ట్రేడింగ్‌లో 5.5 శాతం క్షీణించాయి. ఇది 2025 ఫిబ్రవరిలో కంపెనీ వెయ్యి నుంచి 2 వేల మంది ఉద్యోగులను తొలగించి రీస్టక్చరింగ్ ప్రారంభించింది. AI ఆధారిత సదుపాయాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా డివైజ్ ధరలు పెరుగుతుండటం HPకి మరో సవాలుగా మారింది.
మెమరీ చిప్‌లలో ప్రత్యేకించి DRAM, NAND ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతుండటంతో HP, డెల్, ఏసర్‌లాంటి పీసీ తయారీదారులు లాభదాయకతలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం రెండవ అర్థభాగంలో ఖర్చులు పెరుగుతాయని.. మెుదటి 6 నెలలకు అవసరమైన స్టాక్ ఇప్పటికే నిల్వ చేసినట్లు సీఈఓ లోరెస్ చెప్పారు. వ్యాపారం పడిపోకుండా చూసుకునేందుకు తక్కువ ఖర్చులకు పార్ట్స్ సప్లై చేస్తున్న వెండార్లతో పనిచేయటం, మెమరీ కాన్ఫిగరేషన్లను తగ్గించడం, డివైజ్ రేట్లలో మార్పులు చేపట్టడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
