చెరువును కబ్జా చేశారని.. అధికార పార్టీ ఎమ్మెల్యే పై బీజేపీ ఆగ్రహం

చెరువును కబ్జా చేశారని.. అధికార పార్టీ ఎమ్మెల్యే పై బీజేపీ ఆగ్రహం

నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో.. బాచుపల్లి గ్రామ సర్వేనెంబర్ 483లో చంద్రన్న కుంట వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. స్టెర్లింగ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో.. చంద్రన్నకుంట వద్ద చెరువు లేదని చూపించి నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎఫ్.టీ. ఎల్ లోకి వచ్చి ఆక్రమించుకొని బఫర్ జోన్ చూపించకుండా నిర్మాణాన్ని చేస్తున్నారని వెల్లడించారు. హెచ్ఎండిఏ వద్ద నుండి మ్యానువల్‭గా అనుమతులు తెచ్చుకోవడం పై.. అధికారుల పనితీరు బట్టబయలు అయిందని తెలిపారు. హెచ్ఎండిఏకి సంబంధించి సైట్ విజిటింగ్ చేసినప్పుడు చెరువు కనిపించలేదా ప్రశ్నించారు. ఇదేం తనకు పట్టనట్టు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ చెరువు లేదని రాయడం పై సిగ్గు మాలిన చర్యగా అభివర్ణించారు.

హెచ్ఎండిఏ అధికారులను మేనేజ్ చేసి అనుమతులు తీసుకోవడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపైన విమర్శించారు. అక్రమంగా అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా... ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని అన్నారు. చెరువులను రక్షించి అనుమతులు ఇచ్చిన రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండిఏ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెరువులను కబ్జా చేస్తూ నిర్మాణాలు సాగిస్తుంటే.. ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీజేపీ నిజాంపేట్ మున్సిపల్ ఇంఛార్జీ సతీష్ ప్రశ్నించారు. ఎకరకు పైగా విస్తీర్ణం ఉన్న కుంటను నామరూపాలు లేకుండా చేశారని సతీష్ ఆరోపించారు. రికార్డుల్లో చెరువు ఉన్నా.. అధికారులు మాత్రం చెరువు లేదని డిక్లరేషన్ ఇవ్వడం వారి అవినీతికి అద్దం పడుతుందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సతీష్ డిమాండ్ చేశారు.