సాగునీటి విడుదల కోసం రైతుల ఆందోళన

సాగునీటి విడుదల కోసం రైతుల ఆందోళన
  •      కమలాపూర్​ మండలంలో పంటలెండుతున్నాయని ధర్నా  
  •      ఎస్సారెస్పీ నుంచి నీళ్లు  రిలీజ్​ చేయాలని డిమాండ్​ 
  •      వరంగల్ ​జిల్లా మడిపల్లిలోనూ  నీళ్ల కోసం నిరసన 

కమలాపూర్, వెలుగు : పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లివ్వాలంటూ సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల, శ్రీరాములపల్లి మెయిర్ ​రోడ్డుపై రైతులు బైఠాయించారు. ఈ సందర్భంగా వంటావార్పు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎస్సారెస్పీ కెనాల్ డీబీఎం 24ఎ ద్వారా హనుమకొండ జిల్లా గుండ్లసింగారం నుంచి రావలసిన నీరు చివరి ఆయకట్టు వరకు రాకపోవడంతో పొలాలన్నీ ఎండి పశువులకు మేతగా మారుతున్నాయన్నారు. వినతిపత్రాలు అందజేసినా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదన్నారు. కమలాపూర్, హసన్ పర్తి, ఎల్కతుర్తి పోలీసులు వచ్చి నచ్చజెప్పినా వినలేదు. దీంతో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి రాకేశ్ ఆందోళన చేస్తున్న చోటికి వచ్చి వారికి సర్ధి చెప్పారు. నీటిని విడుదల చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

నీళ్లు విడుదల చేయాలంటూ...

నెక్కొండ : నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ వరంగల్​జిల్లా నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన గిరిజన రైతులు సోమవారం ఎండిన వట్టెవాగులో నిలబడి నిరసన తెలిపారు. వాగు కింద 10వేల ఎకరాల్లో సాగు చేసుకుంటున్నామని, యాసంగిలో వాగు నుంచి నీరొస్తుందని వరి, మొక్కజొన్న పంటలు వేశామన్నారు. కానీ, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి ఎస్సారెస్పీ, డీబీఎం–48, ఎల్గూరు రంగంపేట చెరువు నుంచి వట్టె వాగులోకి నీటిని వదిలి అదుకోవాలన్నారు.