ఐఎంఆర్ పరిశ్రమను తరలించాలని  అప్పిరెడ్డిపల్లి  రైతుల ఆందోళన

ఐఎంఆర్ పరిశ్రమను తరలించాలని  అప్పిరెడ్డిపల్లి  రైతుల ఆందోళన

ఖైరతాబాద్​,వెలుగు : ఐఎంఆర్​ ఆగ్రో పరిశ్రమ నుంచి వెలువడే దుర్వాసనతో పంటలు పండిచుకోలేకపోతున్నామని, పనుల్లోకి ఎవరూ రావడంలేదని రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లి  రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమను తక్షణం మూసివేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ ఏర్పాటు సమయంలో  కోళ్ల దాణాకు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు యాజమాన్యం చెప్పిందని , అయితే.. చికెన్ ​వ్యర్థాలు, ఎముకలతో  పౌడర్, ఆయిల్​ తయారు చేస్తుందని రైతులు కొర్ర బాలు, జంగయ్య, మల్లేశ్, నర్సింహ ఆరోపించారు.  

పరిశ్రమ నుంచి భరించలేని వాసన వస్తుందని మూసి వేయాలంటూ జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు  చేశామని  పేర్కొన్నారు.  సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పరిశ్రమతో పశువులు మృత్యు వాత పడుతున్నాయని, పంటలకు తెగుళ్లు సోకుతుందని వాపోయారు. 7 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో ఓ సారి వాహనాలను అడ్డుకుంటే 3 పరిశ్రమలను మూత పెట్టారని మళ్లీ తిరిగి ఉత్పత్తి ప్రారంభించారని తెలిపారు.  ఇలాంటి పరిశ్రమకు పొల్యూషన్ ​కంట్రోల్ ​బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని వారు ప్రశ్నించారు.  సుమారు 38 మంది రైతులు పాల్గొన్నారు.