సిలబస్​ పూర్తి కాకుండా పరీక్షలేంటి..ఓయూలో విద్యార్థుల ఆందోళన

సిలబస్​ పూర్తి కాకుండా పరీక్షలేంటి..ఓయూలో విద్యార్థుల ఆందోళన

సిలబస్​ పూర్తి చేయకుండానే పరీక్షలు ఎలా పెడతారని ఓయూ స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్​కి కనీసం 120 పని రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలి. 

కానీ వివిధ కారణాల వల్ల ఓయూలో సెమిస్టర్​కి రెండు నెలలు కాకుండానే పరీక్షలు పెడుతున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇదే అంశంపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా స్పందన కరవైంది. జులై 19న నిరసన తెలపాలని వీసీ ఛాంబర్​కి వెళ్తున్న విద్యార్థులను యూనివర్సిటీ సెక్యూరిటీ హాస్టల్​లోనే బంధించారు. 

దీంతో ఇంటర్నల్​ పరీక్షలను స్టూడెంట్స్​ బాయ్​కాట్​ చేశారు. వర్షంలోనే నిరసనలు కొనసాగిస్తున్నారు. యువతులు లేడిస్​ హాస్టల్​ ముందు నిరసనలు తెలుపుతున్నారు. సిలబస్​ పూర్తయ్యాకే ఎగ్జామ్స్ పెట్టాలని ప్రస్తుతానికి వాటిని వాయిదా వేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

అధికారులు ఓయూ రోడ్లన్ని మూసివేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరసనలు తెలపడం.. అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

వాయిదా వేస్తే సమస్యలు తలెత్తుతాయి

సెమిస్టర్​ పరీక్షలు వాయిదా వేస్తే అకడమిక్​ క్యాలెండర్​ సమస్యలు తలెత్తుతాయని ఓయూ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ ​రాములు తెలిపారు. ‘విద్యార్థులు సరైన టైంలో సర్టిఫికెట్లు పొందలేరు. విదేశీ విద్యార్థులకు వీసా సమస్య ఏర్పడుతుంది. చాలా డిపార్ట్​మెంట్లలో సిలబస్​ పూర్తయింది. కొంత మంది పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే టైమ్​టేబుల్ జారీ చేశాం. 28 నుంచి పరీక్షలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.

గ్రూప్​ 2 ఎగ్జామ్ ​వాయిదా వేయాలె

ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ -2 పరీక్షను 3 నెలలపాటు వాయిదా వేయాలని ఓయూ నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్​ చేశారు. బుధవారం ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్  కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలు, 8న అర్బన్ డెవలప్ మెంట్  ఏవో పరీక్షలు  ఉన్నాయని వారు గుర్తుచేశారు. అదే నెల 29, 30న గ్రూప్- 2 పరీక్ష ఉందని, ఒకే నెలలో ఇన్ని పరీక్షలు రాయడం కష్టమని వారు చెప్పారు.