డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద బాధితుల ఆందోళన

డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద బాధితుల ఆందోళన

నాగోల్ పరిధిలో మన్సూరాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో డబుల్ బెడ్ ఇండ్ల ముందు ఆందోళనకు దిగారు బాధితులు. ఏన్నో ఏండ్లుగా ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం.. మాకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా.. ఎక్కడినుంచో వచ్చినవారికి ఇచ్చిన్రు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఎరుకల నాంచారమ్మ బస్తీలో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇండ్లలో ప్రస్తుతం 200 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. అయితే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని స్థానిక ఎరకల సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. మిగిలి వున్న 88 ఇండ్లను బస్తీలో ఎన్నో ఏండ్ల నుంచి ఉంటున్న స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

ఎరుకల నాంచారమ్మ బస్తీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు స్థానికులకే కేటాయించాలని పలు మార్లు స్థానిక ఎమ్మెల్యే కు వినతి పత్రాలు అందజేశామని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. 

స్థానికంగా ఉన్న వారి ధృవ పత్రాలను పరిశీలించి నిజ నిర్ధారణ చేసి మిగిలిన ఇండ్లను స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పేదల కోసం తమ పోరాటం ఉధృతం చేస్తామని ఎరుకల సంఘం నాయకులు హెచ్చరించారు. ఆందోళన 100 మంది బాధితులు పాల్గొన్నారు.